
తిరువనంతపురం: భారత్ X సౌతాఫ్రికా తొలి టీ20 నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారీ కటౌట్ల ఏర్పాటు చర్చనీయాంశమైంది. బుధవారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులు.. కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్.. నువ్వా నేనా అన్న రీతిలో కటౌట్లు ఏర్పాటు చేశారు. గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లేదారిలో ఈ ఉదయం విరాట్ కోహ్లీ అభిమానులు విరాట్ కోహ్లీ భారీ కటౌట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కెప్టెన్సీ లేకున్నా విరాట్ క్రేజ్ తగ్గలేదని అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫొటోలను షేర్ చేశారు.
విరాట్ కోహ్లీ కటౌట్.. సోసల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి కాస్త నిరాశకు గురైన రోహిత్ శర్మ ఫ్యాన్స్ గంటల వ్యవధిలోనే కోహ్లీ కటౌట్‌ను మించిన రోహిత్ శర్మ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇది కూడా గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లే దారిలోనే ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. క్రికెట్ లవర్స్.. ఈ రెండు భారీ కటౌట్లను చూసి ఎంజాయ్ చేస్తుంటే.. విరాట్ X రోహిత్ ఫ్యాన్స్ మాత్రం గొడవకు దిగుతున్నారు. తమ ఆటగాడి కటౌటే బాగుందంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. ఆల్ కెరళ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరిట రోహిత్ కటౌట్ ఏర్పాటు చేశారు.
అయితే ఈ కటౌట్‌పై కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు. కింగ్ కోహ్లీ కటౌట్ చూసి రోహిత్ శర్మ డబ్బులు పంపించాడా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ కటౌట్ చూసి కోహ్లీ ఫ్యాన్స్ ఓర్వలేకపోతున్నారని రోహిత్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20లు జరుగుతాయి. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 28 (బుధవారం) తిరువనంతపురం వేదికగా జరుగుతుంది. అలాగే రెండో టీ20 మ్యాచ్ గౌహతి వేదికగా అక్టోబర్ 2 (ఆదివారం), చివరి టీ20 ఇండోర్ వేదికగా అక్టోబర్ 4 (మంగళవారం)న జరగనుంది. ప్రతి మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.