India vs South Africa రెండో వన్డేకూ భారీ అడ్డంకి..!

రాంచీ: టీ20 ప్రపంచకప్ కోసం రోహిత్ సేన ఆస్ట్రేలియాలో ఉండగా.. స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా చావోరేవో తేల్చుకోనుంది. బౌలర్లు, టాపార్డర్ వైఫల్యం,చెత్త ఫీల్డింగ్‌తో తొలి వన్డేలో ఓడిపోయిన భారత్ ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలవాలని చూస్తోంది. అయితే అసలే బౌలింగ్‌లో బలహీనంగా ఉన్న జట్టుకు మరో షాక్ తగిలింది. గాయంతో స్టార్ పేసర్ దీపక్ చాహర్ కూడా దూరం కావడం జట్టు ఎంపికను సంక్లిష్టంగా మార్చింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించాలంటే బౌలింగ్‌లో భారత్ బలంగా పుంజుకోవడం అవసరం.

బౌలింగ్ బాగుంటేనే..
గెలిచి సిరీస్‌లో నిలవాలనుకుంటున్న టీమిండియాకు బౌలింగే సమస్య. వెన్ను గాయంతో తాజాగా దీపక్ చాహర్ కూడా దూరం కావడంతో ఇబ్బంది మరింత పెరిగింది. తుది జట్టు ఎంపికే సంక్లిష్టమైంది. బౌలర్లు ఏమేర రాణిస్తారన్నదానిపైనే భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. చాహర్ తొలి వన్డేలోనూ ఆడలేదు. ఫాస్ట్‌బౌలర్లు మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ ఇప్పటివరకు ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇంకా అరంగేట్రం చేయని బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్‌కు అవకాశం దక్కొచ్చు.

శ్రేయస్, శాంసన్‌పైనే ఆశలు..
ఇక బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్ రాణించడం అతడికి, జట్టుకు చాలా ముఖ్యం. అతడు టీ20 ప్రపంచకప్‌నకు స్టాండ్‌బైగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్ అయిన శ్రేయస్.. తొలి వన్డేలో టాప్ ఆర్డర్ కుప్పకూలిన భారత్‌ను ఆదుకున్న సంగతి తెలిసిందే. షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో తడబడే బలహీనత ఉన్న శ్రేయస్ ఎదురుదాడికి దిగాడు.
అయితే మొదటి వన్డేలో భారత్‌కు అతి పెద్ద సానుకూలాంశం మాత్రం సంజు శాంసన్ ప్రదర్శనే. చాలా పరిణతితో ఆడిన అతడు కేవలం 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ముచ్చటైన షాట్లతో అలరిస్తూ జట్టును గెలిపించడానికి గట్టి ప్రయత్నమే చేశాడు. అతడు ఫామ్‌ను కొనసాగిస్తాడని జట్టు ఆశిస్తోంది.
ఇక కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా మంచి ఆరంభాన్నివ్వాలని జట్టు కోరుకుంటోంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ వన్డే ఓపెనర్‌గా తాను తగినవాడినని మరోసారి చాటి చెప్పాలనుకుంటున్నాడు. రవి బిష్ణోయ్ స్థానంలో ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చే అవకాశముంది.

వాతావరణం ఎలా ఉందంటే..?
వర్షం కారణంగా తొలి వన్డేలో ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. రెండో వన్డే సందర్భంగా కూడా వాన పడే అవకాశాలు ఉన్నాయి. రాంచీలో మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడేందుకు 20 శాతం అవకాశాలున్నాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. మ్యాచ్ జరిగే సమయంలో మైదానాన్ని మేఘాలు కమ్మెస్తాయని, ఉక్కపోతగా ఉంటుందని తెలిపింది. మ్యాచ్ ప్రారంభ సమయంలో 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ముగింపు సమయంలో 23 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని స్పష్టం చేశాయి.

పిచ్ రిపోర్ట్..
మ్యాచ్ వేదిక జేఎస్‌సీఏ స్టేడియంలోని పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. గత అయిదు వన్డేల్లో మూడుసార్లు మొదటి ఇన్నింగ్స్‌లో 280+ స్కోర్లు నమోదయ్యాయి. ఫాస్ట్, స్పిన్ బౌలర్లకు ఈ పిచ్ అనుకూలిస్తోంది. ఇక పేసర్లు 33.69 యావరేజ్, 5.36 ఎకానమీతో పరుగులివ్వగా.. స్పిన్నర్లు 36.80 యావరేజ్, 5.35 ఎకానమీ నమోదు చేశారు. వర్ష సూచన నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక్కడ భారత్ ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడగా.. 2 గెలిచి మరో 2 ఓడింది. ఒకటి ఫలితం తేలలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications