
ఆటగాళ్లకు ఘన స్వాగతం..
తిరువనంతపురంలో భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి హోటల్కు చేరుకున్న భారత ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు కేరళ క్రికెట్ బోర్డు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసింది. బస్ దిగి హోటల్‌కు వచ్చే దారిలో ప్లేయర్లపై అందమైన అమ్మాయిలతో పూలు చల్లించారు. అలాగే ప్లేయర్ల మెడలో మెడల్స్ వేయించారు. సంప్రదాయ కేరళ చీరకట్టుతో మెరిసిన అమ్మాయిల స్వాగతాల మధ్య ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ హోటల్లోకి వెళ్లారు. ప్లేయర్ల బస నేపథ్యంలో హోటల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

బలంగా బ్యాటింగ్..
భారత జట్టు అతితక్కువ స్కోరుకే ఔటవడం ఈ మధ్య కాలంలో ఏనాడూ జరగలేదు. అందుకు కారణం బలమైన బ్యాటింగ్ లైనప్. ఒకరు విఫలమైనా.. మరొకరు రాణించి ప్రత్యర్థి ముందు మంచి స్కోర్లనే ఉంచారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ లాంటి నైపుణ్యం గల బ్యాటర్లు జట్టు సొంతం. కొద్దికాలంగా రన్స్ చేసేందుకు ఇబ్బంది పడిన కోహ్లీ మళ్లీ ఫామ్‌ను అందుకొని పరుగుల వేటను ప్రారంభించాడు. ఆసియా కప్‌లో సెంచరీ, ఆపై ఆసీస్‌తో నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో అర్ధ శతకంతో రాణించాడు. ఇక సూర్య కుమార్ ప్రస్తుతం తన అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సఫారీతో సిరీస్‌తోపాటు వరల్డ్‌కప్‌లోనూ మెరుపులు కొనసాగాలని జట్టు మొత్తం ఆశిస్తోంది.

బౌలింగ్ బలహీనంగా..
ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచుతున్నప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోవడమే ఇప్పుడు జట్టు ముందున్న అతిపెద్ద సమస్య. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. పవర్ ప్లేలో ఉత్తమంగానే బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. తర్వాత తేలిపోతున్నారు. గతంలో డెత్ ఓవర్ల స్పెషలిస్టులుగా పేరుగాంచిన భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్.. ఇప్పుడు అక్కడే ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ప్రపంచకప్‌కి ముందు వారు ఈ సమస్యను అధిగమించేందుకు ఈ సిరీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వారు తిరిగి తమ లయను అందుకోవాలని జట్టుతోపాటు అభిమానులు కోరుకుంటున్నారు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన బుమ్రా సైతం కట్టడిగా బౌలింగ్ చేస్తే.. ప్రత్యర్థులకు చెమటలు పట్టించడం ఖాయం.

వాతావరణం..
బుధవారం తిరువనంతపురంలో వర్షం పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మైదానాన్ని మబ్బులు కమ్మే అవకాశం ఉంది. వర్షం రావడానికి 50 శాతం ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సౌతిండియాలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కూడా వాతావరణం చల్లగా మారింది. మంగళవారం కూడా అక్కడ వర్షం పడింది.

పిచ్ రిపోర్ట్..
కేరళలోని గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ఇప్పటి వరకు రెండు టీ20లు జరగ్గా.. ఒక్కటి వర్షంతో 8 ఓవర్లపాటే జరిగింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి ముందు బ్యాటింగ్ చేసిన జట్టు గెలవగా మరో మ్యాచ్ చేజింగ్ టీమ్ గెలిచింది. కాబట్టి ఇక్కడి పిచ్ పరిస్థితిని అంచనా వేయలేని పరిస్థితి. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఫాస్ట్, బౌన్సీ పిచ్‌ను సిద్దం చేసే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications
