
హైదరాబాద్: ఆసియాకప్‌లో భాగంగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు పక్కదారి పట్టాయి. సోమవారం టికెట్లను అందుబాటులో ఉంచిన ఆరున్నర నిమిషాల్లోనే మొత్తం హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో టికెట్లు లభించక చాలా మంది నిరాశకు గురయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు అమ్మకాలు ఉంటాయని నిర్వహకులు ముందుగానే ప్రకటించడంతో టికెట్ల కోసం అభిమానులు పోటీపడ్డారు.
సుమారు 75 వేల మంది టికెట్ల కోసం ఒకేసారి లాగిన్ అవ్వడంతో అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. రద్దీని నియంత్రించేందుకు నిర్వహకులు సైట్‌లో క్యూ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకే ఏడున్నర లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు. అయితే టికెట్లు తక్కువగా ఉండటంతో రాత్రి అమ్మకాలు మొదలుపెట్టిన నిమిషాల్లోనే మొత్తం అయిపోయాయి.
అయితే దాయాదుల పోరుకు ఉన్న భారీ డిమాండ్, అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకుంటూ అక్రమార్కులు బ్లాక్ దందాకు తెరలేపారు. ఒక్కో టికెట్‌ను నాలుగు రెట్లు పెంచి అమ్ముతున్నారు. సుమారు ఒక్కో టికెట్ రూ.15 వేలకు అమ్ముతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. చేసేది లేక బ్లాక్‌లో టికెట్ ధరకు నాలుగింతలు ఎక్కువ చెల్లించి తీసుకుందామన్నా టికెట్లు దొరకడం లేదని అభిమానులు వాపోతున్నారు. తాము ఒక్కో టికెట్‌కు రూ.30 వేలు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని, ఎక్కడ అమ్ముతున్నారో చెప్పండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. దాంతో ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగా మారింది. ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది.
ఈ క్రేజ్‌ను ఐసీసీతో పాటు బ్రాడ్ కాస్టింగ్ చానెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. ఆ క్రమంలోనే ప్రతీ టోర్నీలో ఇరు జట్లు తలపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ సైతం ఈ ఫార్మూలాను ఫాలో అయ్యింది. ఆసియాకప్‌లో భాగంగా ఆగస్టు 28న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించింది. ఇరు జట్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే.. టోర్నీలో మరో రెండు సార్లు తలపడే అవకాశం ఉంది. అదే జరిగితే అక్రమార్కుల పంట పండినట్లే.