
బ్రిస్బేన్ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరగాల్సిన భారత్, పాకిస్థాన్ టీ20 ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియా, బ్రిస్బెన్‌లోని అలెన్ బోర్డర్ మైదానం వేదికగా ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షార్పణమైంది. ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. భారత్-పాక్ మ్యాచ్‌తో పాటు ఆస్ట్రేలియా-వెస్టిండీస్, బంగ్లాదేశ్-థాయ్‌లాండ్ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా రద్దయ్యాయి. అడిలైడ్ వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళలపై న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక తమ తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్‌ను భారత్ ఈనెల 18న వెస్టిండీస్‌తో ఆడనుంది. ఈ నెల 21న భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో ఈ మెగాటోర్నీ ప్రారంభంకానుంది.
ఇక ఈ మెగా టోర్నీకి ముందు జరిగిన ట్రై సిరీస్‌ను హర్మన్ ప్రీత్ నేతృత్వంలోని భారత్ తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఈ త్రీనేషన్ సిరీస్‌ను ఆతిథ్య జట్టు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓపెనర్ మంధానా ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు.