కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్‌పై కొంచెం మాయిశ్చర్ ఉంది.
ఈ అడ్వాంటేజ్‌ను వాడుకోవాలనుకుంటున్నాం. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే హై ఓల్టేజ్ మ్యాచ్. కానీ మేం ఓ సాధారణ మ్యాచ్‌లానే చూస్తున్నాం. ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు. ఇక టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ తీసుకునేవాళ్లమని రోహిత్ శర్మ తెలిపాడు. ముందుగా బ్యాటింగ్ చేయడం తమకు కఠిన సవాలని పేర్కొన్నాడు.

'ముందుగా బ్యాటింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నది. కానీ గత మ్యాచ్‌లో మా ఆటగాళ్లు అసాధారణ బ్యాటింగ్‌తో మా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించారు. ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమే. కానీ వర్ష ప్రభావంపై కూడా ఫోకస్ పెట్టాలి. ఇక ఈ మ్యాచ్ కోసం అన్ని విధాలుగా ప్రిపేరయ్యాం.
జట్టులో రెండు మార్పులు చేశాం. జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి రాగా.. శ్రేయస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను తీసుకున్నాం. అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాం'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి రావడంతో మహమ్మద్ షమీ ఉద్వాసనకు గురయ్యాడు.

తుది జట్లు
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
పాకిస్థాన్: ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసీమ్ షా.