కొలంబో : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అభిమానులు మండిపడుతున్నారు. ఆసియాకప్ 2023 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్‌కు దిగగా.. తుది జట్టులో రెండు మార్పులు జరగాయి.
సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి రాగా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్‌లు ఉద్వాసనకు గురయ్యారు. శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతుండటంతోనే పక్కకు పెట్టామని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. బుమ్రా కోసం షమీని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

అతనికి బదులు బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్‌ను జట్టులో కొనసాగించారు. అయితే షమీని తీసుకోకపోవడం తెలివి తక్కువ నిర్ణయమని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఏ లెక్కన చూసుకున్న శార్దూల్‌కు బదులు షమీని తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై మహమ్మద్ షమీకి మంచి రికార్డు ఉందని, అతను జట్టులో ఉండి ఉంటే షమీ ఇబ్బంది పడేవాడని అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్ డెప్త్ కోసం చూసిన టీమిండియా.. బౌలింగ్ డెప్త్ చూసుకోకపోవడం విడ్డూరమని విమర్శిస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ షమీకి బదులు భువనేశ్వర్ కుమార్‌ను తీసుకొని మూల్యం చెల్లించుకున్నారని, మరోసారి అదే తరహా తప్పిదం చేశారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అండర్ లైట్స్ కింద కొత్త బంతితో షమీ అసాధారణ బౌలింగ్ చేస్తాడని, అతన్ని ఈ మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా మిస్సవుతుందని అభిప్రాయపడుతున్నారు. కొందరైతే శార్దూల్ ఠాకూర్ ఆడటం వల్ల జట్టుకు ఒరిగేదేం ఉందని ప్రశ్నిస్తున్నారు. అరకొర ఆటగాడైన శార్దూల్ ఠాకూర్ జట్టులో అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు మాత్రం శార్దూల్‌కు అండగా నిలుస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2022తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో షమీ విఫలమయ్యాడని, నేపాల్‌తో మ్యాచ్‌లో కూడా అంతగా ప్రభావం చూపలేదని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.
తుది జట్లు
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
పాకిస్థాన్: ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసీమ్ షా.