ఆసియాకప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరగనున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు అభిమానుల బాయ్‌కట్ సెగ తగిలింది. దాంతో హాట్ కేకుల్లా క్షణాల్లో అమ్ముడవ్వాల్సిన ఈ మ్యాచ్ టికెట్లు సగం కూడా అమ్ముడవలేదని తెలుస్తోంది. టికెట్ల అమ్మకాలు పెంచేందుకు నిర్వాహకులు టికెట్ ధరలు తగ్గించినా ఫలితం లేదంట. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్ ఆడవద్దని భారత నెటిజన్లు సూచించారు. కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ), ఐసీసీ రూల్స్ ప్రకారమే ఆడుతున్నామని బీసీసీఐ వివరణ ఇచ్చినా.. భారత నెటిజన్లు అంగీకరించడం లేదు.
కొందరు సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ కూడా వేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ పిటిషన్ విచారించేందుకు సుప్రీం నిరాకరించింది. అయినా వెనకడుగువేయని నెటిజన్లు గత కొద్ది రోజులుగా బాయ్‌కట్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అనే యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇది మ్యాచ్ టికెట్ల సేల్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా యూఏఈ వేదికగానే జరిగిన భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఇరు దేశాల అభిమానులు ఎగబడ్డారు. కానీ తాజా మ్యాచ్ పరిస్థితి భిన్నంగా ఉంది. భారత్-పాక్ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు బీసీసీఐ పెద్దలు కూడా వెనకడుగు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ నుంచి ఒకరిని మాత్రమే ఈ మ్యాచ్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. బీసీసీఐ ప్రతినిధిగా ఒకరు మాత్రమే దుబాయ్‌కి వచ్చారని, మిగతా ఎవరూ రాలేదని జాతీయ మీడియా పేర్కొంది. బాయ్‌కాట్ క్యాంపెయిన్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా భారత్, పాక్ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి మ్యాచ్ టికెట్ల కోసం ప్రముఖులు ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదని వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలోని భారత్-పాక్ మ్యాచ్‌కు దేశంలోని సినీ, రాజకీ, క్రీడా ప్రముఖులు పలువురు హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూశారు. కానీ ఈ సారి అలాంటి ఊసే లేదు. ఈ మ్యాచ్‌కు హాజరై.. అనవసర నెగిటివిటీని మూటగట్టుకోవడం ఎందుకని సెలెబ్రిటీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకపోవడం కూడా ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.