India Vs Pakistan: ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఈ ఏడాది దాయాదుల దండయాత్ర ఎన్నిసార్లంటే?
క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు దేశాలే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఈ దాయాదుల పోరుపై ఆసక్తికనబరుస్తోంది. ఇరు దేశాల్లో ఈ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ మాటల్లో చెప్పలేం. భారత్-పాక్ మ్యాచ్ అనగానే అంతా టీవీలకు అతుక్కుపోతారు. మైదానంలో ఇరు దేశాల మధ్య జరిగే యుద్దంలా భావిస్తారు. సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే నడుపుతారు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-పాక్ పోరుకు మరింత క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల తర్వాత భారత్-పాక్ పోరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. కొత్త ఏడాదిలోనూ భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. అండర్ 19 ప్రపంచకప్‌తో పాటు పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్‌లు దాయాదీ మ్యాచ్‌లకు వేదికగా నిలవనున్నాయి.
గతేడాది భారత్, పాకిస్థాన్ జట్లు పలుమార్లు తలపడ్డాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఒక సారి తలపడగా.. ఆసియాకప్‌లో మూడు సార్లు ఢీకొన్నాయి. మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఒకసారి ఆడగా.. అండర్ 19 ఆసియాకప్‌లో రెండు సార్లు తలపడ్డాయి. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ మినహా ప్రతీ మ్యాచ్‌లోనూ భారత్‌నే విజయం వరించింది. ఈ ఏడాది కూడా భారత్, పాక్ దేశాలు పలుమార్లు తలపడనున్నాయి.

1.పురుషుల టీ20 ప్రపంచకప్..
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15 భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు తటస్థ వేదికగా మ్యాచ్‌లు ఆడాలనే ముందస్తు ఒప్పందంలో భాగంగా ఈ మ్యాచ్ శ్రీలంకలో జరగనుంది. ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేస్తే.. సెమీఫైనల్, ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి.
2. అండర్ 19 పురుషుల ప్రపంచకప్..
జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే అండర్ 19 ఐసీసీ పురుషుల ప్రపంచకప్‌లోనూ భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు జట్లు లీగ్ దశలో తలపడటం లేదు. తొలిసారి భారత్, పాకిస్థాన్ జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. భారత్ గ్రూప్-బీలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, యూఎస్‌ఏతో ఉండగా.. పాకిస్థాన్ గ్రూప్‌సీలో ఇంగ్లండ్, స్కాట్లాండ్, జింబాబ్వేలు ఉన్నాయి. వేర్వేరు గ్రూప్‌లో ఉన్నందున లీగ్ స్టేజితో పాటు సూపర్-6లో తలపడే ఛాన్స్ లేదు. కానీ ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన కనబర్చితే సెమీఫైనల్ లేదా ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంది.
3. మహిళల టీ20 ప్రపంచకప్
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో మాత్రం భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ టోర్నీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 14న జరగనుంది. మెరుగైన ప్రదర్శన కనబర్చితే సెమీఫైనల్ లేదా ఫైనల్లో మరోసారి తలపడవచ్చు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదన్న సంగతి తెలిసిందే. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications