అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ డిస్నీహాట్ స్టార్ చరిత్ర సృష్టించింది. క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో రికార్డు రియల్ టైమ్ వ్యూస్‌ను రాబట్టింది. ఈ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగినా గరిష్టంగా 3 కోట్ల 40 లక్షల వ్యూస్ వచ్చాయి.
ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసే సమయంలో ఈ రికార్డు నమోదు అయ్యింది. ఏ దశలోనూ వ్యూస్ 3 కోట్లకు తగ్గలేదు. వన్డే ప్రపంచకప్ ముందు శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్ 2023లోనూ భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు గరిష్టంగా 2 కోట్ల 80 లక్షల రియల్ టైమ్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ రికార్డుగా ఉండగా.. తాజా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అధిగమించింది.ఈ మ్యాచ్‌కు ముందు 2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు గరిష్టంగా 2 కోట్ల 53 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది కూడా హాట్ స్టార్ రికార్డే.

ఈ సారి సబ్‌స్క్రిప్షన్ లేకుండా హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు చూసే అవకాశం కల్పించడంతో ఈ రికార్డు వ్యూస్ నమోదు అయ్యాయి. జియో సినిమా దెబ్బకు హాట్‌స్టార్ ఆసియాకప్‌తో పాటు ప్రపంచకప్ మ్యాచ్‌లను సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసే ఆస్కారం కల్పించింది. మెగా టోర్నీ భారత్ ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగలేదు. అన్ని మ్యాచ్‌లు ఏకపక్షంగా ముగిసాయి. ప్రధాన జట్ల మధ్య టఫ్ మ్యాచ్ జరిగితే వ్యూస్ 4 కోట్లు దాటే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మినహా అంతా విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86) తృటిలో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ తీసాడు.