పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌తో పాకిస్థాలోని దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ దాడిని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ సైతం మిసైళ్లతో దాడులు దిగింది. వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో ఇరు దేశాల మధ్య యుద్దం వాతావరణం నెలకొంది. చివరకు చర్చల ద్వారా ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ పరిస్థితులతో ఆసియాకప్ 2025 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పాకిస్థాన్‌కు చెందిన మోహ్‌సిన్ నఖ్వీ అధ్యక్షుడిగా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో భారత్ పాల్గొనదనే వార్తలు కూడా వచ్చాయి. పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఆడవద్దనే డిమాండ్ కూడా నెటిజన్ల నుంచి ఆ సమయంలో వ్యక్తమైంది. కానీ ముందస్తు ప్రణాళికల ప్రకారమే ఆసియాకప్ 2025 జరుగుతుందని, షెడ్యూల్ కూడా సిద్దమైందని ప్రచారం జరుగుతోంది. 21 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉందని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.

ఈ రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ 5(శుక్రవారం)న ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ గ్రూప్ స్టేజ్‌లో భారత్, పాకిస్థాన్ సెప్టెంబర్ 7(ఆదివారం)న తలపడనున్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్ 4 ఫార్మాట్‌లో 2022, 2023 తరహాలో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్, పాకిస్థాన్ సూపర్-4లో క్వాలిఫై అయితే సెప్టెంబర్ 14న(ఆదివారం) మరోసారి తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 21(ఆదివారం)న జరగనుంది. భారత్, పాక్ ఫైనల్ చేరితో ఇరు జట్లు మూడో సారి తలపడుతాయి.
వాస్తవానికి ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కే ఉన్నాయి. కానీ ఇరు దేశాల్లో ఒకరికొకరు పర్యటించుకోకూడదనే ఒప్పందం నేపథ్యంలో యూఏఈ వేదికగా ఆసియాకప్ 2025ను నిర్వహించే అవకాశం ఉంది. జూలై తొలి వారంలో ఆసియా కప్ షెడ్యూల్ విడుదలవ్వనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ జట్లు తలపడనున్నాయి. అయితే ఆసియా కప్ షెడ్యూల్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.