
పటిష్టంగా కోహ్లీసేన..
న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును గత మంగళవారం ప్రకటించింది. దీని ప్రకారం రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయడం ఖాయమైపోయింది. ఆ తర్వాత బిగ్ త్రీ చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే వస్తారు. ఈ టాప్-5 బ్యాట్స్‌మన్‌లో ఏ ముగ్గురు చెలరేగిన భారత్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. వీరికి జతగా ఫించ్ హిట్టర్ రిషభ్ పంత్ తోడైతే పరుగుల వరద పారుతోంది. ఆ తర్వాత జడేజా, అశ్విన్ రూపంలో లోయరార్డర్ కూడా బలంగా ఉంది. అంచనాల మేరకు రాణిస్తే భారత్‌కు ఏ కష్టాలు ఉండవు. కానీ వీరంతా ఏమేరకు రాణిస్తారన్నదానిపై విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఓపెనర్లు ఇద్దరూ కలిసి ఇప్పటిదాకా ఇంగ్లండ్‌లో ఇన్నింగ్స్ ఓపెన్ చేసింది లేదు. రోహిత్ 2014లో ఇంగ్లండ్‌లో ఓ టెస్ట్ ఆడాడు. గిల్ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా లేదు. దీంతో ఇంగ్లిష్ కండిషన్స్‌లో అనుభవం లేని ఈ ఓపెనింగ్ కాంబో ఏం చేస్తారో ఊహించలేం. ఇక, బ్యాటింగ్ మూల స్థంభాలైన చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేకు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉంది. కానీ ఈ త్రయం ప్రస్తుత ఫామ్ కాస్త కలవరపెడుతోంది. వీళ్ల నుంచి అదిరిపోయే పెర్ఫామెన్స్ వచ్చి చాలా కాలమైంది. వీళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది.

ముగ్గురు పేసర్లు..
ఇక పిచ్ నేపథ్యంలో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా, అశ్విన్ తుది జట్టులో ఉండటం ఖాయం. ఇంగ్లిష్ కండీషన్స్ బట్టి చూస్తే పేసర్లు బుమ్రా, షమీ ఆటోమెటిక్ చాయిస్. ఈ ఇద్దరి వేరియేషన్స్ కూడా అద్భుతంగా పని చేస్తాయి. చాలా రోజుల నుంచి భారత బౌలింగ్ కాంబినేషన్లో కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు థర్డ్ పేసర్ ఎవరన్నదే అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఇషాంత్ శర్మ, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ మధ్య ఈ ప్లేస్ కోసం పోటీ నెలకొంది. వేరియేషన్ కోసం సిరాజ్‌ను తీసుకోవాలని టీమిండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా సిరాజ్ వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఇంగ్లండ్‌లో ఎక్స్‌పీరియెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఇషాంత్‌కే చాన్స్ ఎక్కువగా ఉంది.

విజయ ఉత్సాహంలో కివీస్..
టీమ్‌ఇండియాకు ఉన్నట్లుగానే న్యూజిలాండ్‌కు ఉత్తమ వనరులున్నాయి. పైగా ఆ జట్టు విజయ ఉత్సాహంలో బరిలోకి దిగుతోంది. కొన్నేళ్లుగా న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగం ఎంతో పటిష్ఠంగా తయారైంది. విలియమ్సన్‌కు తోడు ప్రధాన బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుత జట్టులోనే అత్యంత అనుభవజ్ఞుడైన రాస్ టేలర్.. మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఆ జట్టులోని మరో కీలక బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్. ఇన్నింగ్స్ ఆరంభంలో ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీసి సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం ఈ ఓపెనర్ సొంతం. కొత్త ఓపెనర్ కాన్వేతోనూ ప్రమాదమే. అతనితో పాటు నికోలస్, వాట్లింగ్, బ్లండెల్‌తో కూడిన ఆ జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. పేస్ ఆల్‌రౌండర్లు గ్రాండ్‌హోమ్, జెమీసన్ బ్యాటుతోనూ మెరుపులు మెరిపించగలరు.
బౌలింగ్‌లోనూ కివీస్‌కు ఎదురులేదు. అగ్రశ్రేణి సీనియర్ పేస్ ద్వయం బౌల్ట్, సౌథీతో పాటు వాగ్నర్, జెమీసన్, హెన్రీ, గ్రాండ్‌హోమ్, స్పిన్నర్ అజాజ్ పటేల్ రూపంలో ఆ జట్టుకు గొప్ప బౌలింగ్ దళం ఉంది. ముఖ్యంగా చాలా ఏళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బౌల్ట్, సౌథీ ఇప్పటికీ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. ప్రపంచ అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్‌నూ వీళ్లు కకావికలం చేయగలరు.

మ్యాచ్ వర్ష గండం..
ఈ మ్యాచ్‌కు వర్ష గండం పొంచి ఉంది. రిజర్వు డేతో కలిసి మొత్తం ఆరు రోజులు సాధారణం నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. వాతావరణ శాఖ, వాతావరణ వెబ్‌సైట్లు ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. దాదాపుగా 80 శాతం వర్షం కురుస్తుందనే చూపిస్తున్నాయి. ఇది మ్యాచ్ ఫలితాన్ని శాసించవచ్చు. ఇక పిచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ త్రీ డేస్ పేస్, బౌన్స్, క్యారీ ఉంటుంది. లాస్ట్ రెండు రోజులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. వర్షం ముప్పు ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ముందు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 59 మ్యాచ్‌లు జరగ్గా భారత్ 21 మ్యాచ్‌లు, న్యూజిలాండ్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 26 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

తుది జట్లు (అంచనా)
భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్/ఇషాంత్ శర్మ
న్యూజిలాండ్: డేవాన్ కాన్వే, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బీజే వాట్లింగ్(కీపర్), కైల్ జెమీసన్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్, అజాజ్ పటేల్


Click it and Unblock the Notifications
