
న్యూఢిల్లీ: భారత్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైల్ జెమీసన్ కూడా దూరయ్యాడు. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్.. టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోగా.. అతని బాటలోనే జెమీసన్ కూడా వెళ్లాడు. టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవడం కోసం ఈ సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించాడు. తమ ప్రణాళికల్లో భాగంగానే జేమీసన్‌కు విశ్రాంతినిచ్చామన్నాడు.
'కేన్ విలియమ్సన్, కైల్ జేమీసన్తో మాట్లాడాకే టీ20 సిరీస్‌లో వారికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వారు టెస్టు సిరీస్ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నారు. టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న మరికొంత మంది యువ ఆటగాళ్లు కూడా టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశముంది. వెంటవెంటనే పలు కీలక సిరీస్ ఉండటం వల్ల వర్క్‌లోడ్ మేనేజ్ చేయాడికే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.'అని గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్‌కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. అనంతరం టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌తో న్యూజిలాండ్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్‌లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబయి వేదికగా రెండో టెస్టు జరగనుంది. అయితే టీ20 సిరీస్‌ను కివీస్ లైట్ తీసుకున్నట్లు అర్థమవుతుంది. ముందుగా కుదుర్చుకున్న షెడ్యూల్‌ను కాదనలేక ఈ సిరీస్ ఆడుతున్నట్లు అనిపిస్తోంది.

నేడు(నవంబర్ 17) జరగనున్న తొలి మ్యాచ్‌లో కివీస్‌ను ఢీకొట్టేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. టీ20 కెప్టెన్ పగ్గాలు చేపట్టాక రోహిత్‌కు ఇదే తొలి మ్యాచ్ కాగా, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తన ప్రస్థానాన్ని ఈ మ్యాచ్‌తోనే ప్రారంభించనున్నాడు. టీ20 ప్రపంచకప్ రన్నరప్ కివీస్ జోరు మీదుండగా.. టీ20 ఫార్మాట్ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ, కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో టీమిండియా చేయబోయే పెర్ఫామెన్స్‌పై అందరి దృష్టి నెలకొంది. రోహిత్ గతంలో పలు మార్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
గత శ్రీలంక పర్యటనలో ద్రవిడ్ కూడా భారత్ కోచ్‌గా పనిచేశాడు. కానీ వీరిద్దరూ ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టగా.. తొలి పరీక్షను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. తొలి పోరులోనే గెలిచి సిరీస్ పట్టు సాధించాలని భావిస్తున్న రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తొంది. కోహ్లీ సహా పలువురు సీనియర్ల గైర్హాజరీలో చాన్నాళ్ల తర్వాత సొంతగడ్డపై ఆడుతున్న ఈ సిరీస్ ఫలితం భారత్‌కు కీలకం.