
వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సెక్యూరిటీ కళ్లు గప్పి ఇద్దరు అభిమానులు మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి పరుగెత్తుకొచ్చారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది వారిని బయటకు లాక్కెళ్లారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
భారత పేసర్ నవ్‌దీప్ సైనీ వేసిన రెండో ఓవర్‌లో మూడో బంతి తర్వాత ఒక అభిమాని అనూహ్యంగా అక్రమంగా మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. దీంతో అవాక్కైన సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకెళ్లగా.. ఇంకో వైపు మరో అభిమాని మైదానంలోకి దూసుకెళ్లాడు. ఆటగాళ్ల దగ్గరకు వెళ్తున్న అతన్ని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ బయటకు లాక్కెళ్లారు. ఇక ఈ ఇద్దరూ.. బంతి వేసిన తర్వాతనే మైదానంలోకి రావడం గమనార్హం.
అయితే అభిమానులు మైదానంలోకి పరుగెత్తుకు రావడం ఇదే తొలిసారేం కాదు. ఈ తరహా ఘటనలు ఇండియాలో ఎక్కువగా జరుగుతాయి. గతేడాదని ఇదే న్యూజిలాండ్‌లో ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చి ధోని పాదాలకు నమస్కరించడం... అతని చేతిలో కింద పడ్డ జెండాను మహీ తీసియడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇక అంతేకాకుండా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మరో మ్యాచ్‌లో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి రాగా... అతనికి దొరకకుండా ధోని సరదాగా పరుగెత్తాడు. ఇలానే విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ అభిమానులు సైతం తమ ఆరాథ్య ఆటగాళ్ల కోసం భద్రతా నిబంధనలు ఉల్లంఘించి మైదానంలోకి పరుగెత్తుకొచ్చారు.
ఇక ఈ మ్యాచ్‌లో సోధి, బెన్నెట్ ధాటికి టీమిండియా టాపార్డర్ విఫలవవ్వగా.. మనీష్ పాండే (50 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు) అజేయ హాఫ్ సెంచరీతో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. పాండే ఆదుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసిన భారత్.. కివీస్ ముందు 166పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకెళ్తోంది.