మూడో వన్డేలో కివీస్ ఘన విజయం.. 3-0తో సిరీస్ వైట్‌వాష్.. భారత్ చెత్త రికార్డు!!

మౌంట్ మాంగనూయ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్యంను కివీస్ 47.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ విజయంతో న్యూజిలాండ్ సిరీస్‌ను 3-0తో వైట్ వాష్ చేసింది. మార్టిన్ గప్టిల్ (46 బంతుల్లో 66: 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (103 బంతుల్లో 80: 9 ఫోర్లు) కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (28 బంతుల్లో 58: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్ యుజువేంద్ర చహల్ మూడు వికెట్లు తీసాడు.

29 బంతుల్లో గప్తిల్ హాఫ్ సెంచరీ:
297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు. గప్తిల్ మొదటి ఓవర్ నుండే బౌండరీల మోత మొదలెట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీలను ధీటుగా ఎదుర్కొంటూ సునాయాసంగా పరుగులు చేసాడు. సైనీ వేసిన ఆరో ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన గప్తిల్.. బుమ్రా వేసిన ఏడవ ఓవర్లో మరో ఫోర్, సిక్స్ బాదాడు. చహల్, ఠాకూర్‌లను కూడా వదలలేదు. ఈ క్రమంలోనే 29 బంతుల్లో గప్తిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు.

విలియమ్సన్ విఫలం:
మరోవైపు హెన్రీ నికోల్స్ ఆచితూచి ఆడుతూ గప్తిల్‌కు మంచి సహకారం అందించాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ గప్తిల్‌కు అండగా నిలిచాడు. ఇక హాఫ్ సెంచరీ అనంతరం గప్తిల్ మరింత రెచ్చిపోయాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో చహల్ వేసిన 17వ ఓవర్ మూడో బంతికి గప్తిల్ (66) బోల్డ్ అయ్యాడు. దీంతో 106 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (22) నెమ్మదిగా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో చాహల్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

నికోల్స్ హాఫ్ సెంచరీ:
ఒకవైపు వికెట్లు పడుతున్నా హెన్రీ నికోల్స్ మాత్రం భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ చేసాడు. ఇక సిరీస్‌లో అత్యద్భుతంగా రాణించిన సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (12) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. మరో మూడు పరుగుల అనంతరం హాఫ్ సెంచరీ చేసిన నికోల్స్ ఔట్ అయ్యాడు. కొద్దిసేపు ఆకట్టుకున్న జిమ్మీ నీషమ్ (19) కూడా పెవిలియన్ చేరడంతో కివీస్ ఐదు వికెట్లు కోల్పోయింది.

గ్రాండ్‌హోమ్ వీరవిహారం:
ఐదు వికెట్లు పడడంతో భారత్ మ్యాచులోకి వచ్చింది అని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో టామ్ లాతమ్ అద్భుతంగా ఆడి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. మరోవైపు కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బ్యాట్ జులిపించి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ జోడి వేగంగా పరుగులు చేస్తూ న్యూజిలాండ్‌ను విజయం దిశగా తీసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే గ్రాండ్‌హోమ్ 21 బంతుల్లో అర్ధ సెంచరీ అందుకున్నాడు. ఇక 46వ ఓవర్లో గ్రాండ్‌హోమ్ వీరవిహారం చేయడంతో కివీస్ సునాయాస విజయాన్ని అందుకుంది. లాతమ్ (32), గ్రాండ్‌హోమ్ (58) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
మూడో క్లాస్ నుండే క్రికెట్‌పై ఆసక్తి.. ఐదులోనే అత్యుత్తమ ప్రదర్శన!!

రాహుల్ సెంచరీ:
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ సెంచరీ (113 బంతుల్లో 112; ఫోర్లు 9, సిక్సులు 2)తో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్ (63 బంతుల్లో 62; ఫోర్లు 9) కీలక సమయంలో హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. మనీష్ పాండే తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 48 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో బెన్నెట్ 4 వికెట్లు తీయగా.. జెమిసన్, నీషమ్‌కు చెరో వికెట్ దక్కింది.

భారత్ ఖాతాలో చెత్త రికార్డు:
టీ20ల్లో టీమిండియా 5-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. న్యూజిలాండ్ వన్డేల్లో 3-0తో వైట్‌వాష్ చేసి బదులు తీర్చుకుంది. 1989లో వెస్టిండీస్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన తర్వాత.. మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ల్లో భారత్ అన్ని మ్యాచ్‌లు ఓడలేదు. తాజాగా న్యూజిలాండ్ చేతిలో ఓడి చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications