India vs New Zealand: పోరాడిన భారత్.. తృటిలో చేజారిన విజయం! గట్టెక్కిన కివీస్!

కాన్పూర్: అనేక మలుపులు తిరిగిన భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ చివరకు ఫలితం తేలకుండా ముగిసింది. చివరి క్షణం వరకు పోరాడిన భారత్ విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది. ఆజాజ్ పటేల్(23 బంతుల్లో 2 నాటౌట్), రాచిన్ రవీంద్ర(91 బంతుల్లో 18 నాటౌట్) అడ్డుగోడలా నిలబడటంతో భారత విజయం చేజారింది. 4/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ ఆఖరి రోజు ఆట ముగిసేసమయానికి 98 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిని తప్పించుకుంది. బ్యాడ్ లైట్ కారణంగా మరో 8 నిమిషాల ముందే అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేసారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 3 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది.

ఫస్ట్ సెషన్ కివీస్‌దే..
4/1తో చివరి రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ నిలకడగా ఆడింది. ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్(52), విలియమ్ సోమర్ విల్లే(36) అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఓపికగా ఆడుతూ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. సింగిల్స్, డబుల్స్‌తో పాటు వీలు చిక్కిన బంతులను బౌండరీలకు తరలించారు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన టెయిలండర్ విలియమ్ సోమర్ విల్లేను కూడా భారత బౌలర్లు ఇబ్బందిపెట్టలేకపోయారు. దాంతో తొలి సెషన్‌లో న్యూజిలాండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 79/1తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
లాథమ్ హాఫ్ సెంచరీ చేసినా..
లంచ్ బ్రేక్ అనంతరం ఆదిలోనే కివీస్ సోమర్ విల్లే వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ వేసిన ఫస్ట్ బాల్‌కే అతను క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌తో టామ్ లాథమ్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో లాథమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కొద్దిసేపటికే అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేసి అతన్ని పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్ ఇబ్బంది పడగా..అతన్ని టీ బ్రేక్‌కు ముందు జడేజా ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో న్యూజిలాండ్ 125/4 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.
చివరి సెషన్‌లో చెలరేగినా..
ఆఖరి సెషన్‌లో దుమ్మురేపిన భారత బౌలర్లు ఐదు వికెట్లు తీసి గెలుపు ఆశలు రేకెత్తించారు. హెన్రీ నికోల్స్(1)ను అక్షర్ పటేల్ వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. కేన్ విలియమ్సన్‌ను కూడా జడేజా ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన టామ్ బ్లండెల్(2)ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక క్రీజులో కుదురుకుంటున్న కైల్ జెమీసన్‌ను, ఆ తర్వాత వచ్చిన టీమ్ సౌథీలను జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించడంతో భారత విజయం ఖాయమని అంతా భావించారు. కానీ ఆఖరి వికెట్‌గా వచ్చిన ఆజాజ్ పటేల్‌తో రచిన్ రవీంద్ర(91 బంతుల్లో 18 నాటౌట్) భారత్‌కు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఏకంగా 91 బంతులు ఆడి భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు.

సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్ 345 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 296 ఆలౌట్
భారత్ సెకండ్ ఇన్నింగ్స్ 234/7 డిక్లెర్
న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ 165/9
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications