హైదరాబాద్: ఆసియాకప్ 2023 టోర్నీకి ముందు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా మూడు టీ20ల సిరీస్‌కు సిద్దమైంది. డబ్లిన్ వేదికగా శుక్రవారం జరిగే తొలి టీ20తో ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా తృతీయ శ్రేణి జట్టు.. ఆతిథ్య ఐర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
వెన్ను గాయంతో గతేడాదిగా ఆటకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇస్తున్నాడు. కీలక ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌ల ముందు బుమ్రాకు ఈ సిరీస్ మ్యాచ్ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. రెండు మెగా టోర్నీల నేపథ్యంలో ఈ సిరీస్‌కు టీమిండియా కీలక ఆటగాళ్లు దూరంగా ఉన్నారు.

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీ20 సారథి హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చారు. ఐపీఎల్‌లో సత్తా చాటిన తెలుగు తేజం తిలక్ వర్మతో పాటు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రింకూ సింగ్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ముకేష్ కుమార్‌లకు అవకాశం కల్పించారు.
సీనియర్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్టలను కూడా ఎంపిక చేశారు. ఆగస్టు 18న తొలి టీ20, 20న రెండో టీ20, 23న మూడో టీ20 జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఆసియాకప్‌కు ఎంపికైన ఆటగాళ్లు బెంగళూరు వేదికగా నిర్వహించనున్న ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొననున్నారు. రెండో రోజుల్లో ఆసియాకప్ బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించనున్నారు.
ఈ మూడు టీ20ల సిరీస్‌కు స్పోర్ట్స్ 18 అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. దాంతో ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో రావు. స్పోర్ట్స్ 18 చానెల్‌తో పాటు జియో సినిమా యాప్‌లో ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. జియోసినిమా యాప్‌లో ఉచితం ఈ మ్యాచ్‌లను చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. 7 గంటలకే టాస్ పడనుంది.

మూడు మ్యాచ్‌లు డబ్లీన్ వేదికగానే జరగనున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్న రింకూ సింగ్‌పై భారీ అంచనాలున్నాయి. అంతేకాకుండా వెస్టిండీస్ పర్యటనలో సత్తా చాటిన తిలక్ వర్మ ఈ సిరీస్‌లో కూడా రాణిస్తే.. ఆసియాకప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.