అరంగేట్రంలో అదరగొట్టిన సర్‌ప్రైజ్ స్టార్ ప్రసిధ్ కృష్ణ.. మేడిన్ ఆస్ట్రేలియా!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో కొత్త ఆటగాళ్ల హవా నడుస్తోంది. ఐపీఎల్, డొమెస్టిక్ సర్క్యూట్‌లో సత్తా చాటుతున్న టాలెంటెడ్ ప్లేయర్స్ నేషనల్ టీమ్ తలుపు తడుతున్నారు. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న యువ ఆటగాళ్లు ఒక్క చాన్స్ ఇస్తే చాలా చెలరేగిపోతున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్‌లోనే తమ తడాఖా చూపిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి అదరగొట్టగా.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ డెబ్యూ ఆటగాళ్ల హవా కొనసాగుతూనే ఉంది.
తాజాగా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా పేసర్ ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్‌పై తమ ఫస్ట్ వన్డేలోనే అద్భుత ప్రదర్శన కనబర్చారు. 18 టీ20ల అనుభవం ఉన్న కృనాల్ ఇప్పటికే తన సత్తా ఏంటో నిరూపించుకోగా.. సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌గా ఈ సిరీస్‌కు ఎంపికైన ప్రసిధ్ కృష్ణ తన పవర్‌ఫుల్ బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అరంగేట్ర వన్డేలో అత్యధిక వికెట్లు తీసి.. ఈ ఘనతను అందుకున్న భారత బౌలర్‌గా రికార్డు సృష్టించి తన రాకను ఘనంగా చాటుకున్నాడు.

దమ్మున్న పేసర్..
సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో తొలి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్రతీ ఆటగాడిపై ఒత్తిడి ఉంటుంది. ఆరంభంలో ఇబ్బంది పడటం సహజం. ఒత్తిడి తట్టుకోలేక తమ మొదటి మ్యాచ్‌ను చేదు జ్ఞాపకంగా మిగుల్చుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే, ఒత్తిడిని అధిగమించి జట్టును ముందుకు తీసుకెళ్లే వాళ్లు కొద్ది మందే కనిపిస్తారు. ఆ రెండో కోవకు చెవాడే ప్రసిధ్. ఎందుకంటే తన ఫస్ట్ స్పెల్‌లో మూడు ఓవర్లలో అతను ఏకంగా 37 పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ అసాధారణంగా పుంజుకొని మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బిల్లింగ్స్, మొయిన్ అలీలను ఔట్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మేడిన్ ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్‌లీని ఆరాధించే ప్రసిధ్ కంగారూల గడ్డపైనే తన పేస్‌కు పదును పెట్టుకున్నాడు. ఎంతో మంది బౌలర్లను తీర్చిదిద్దిన ఆసీస్ లెజెండరీ పేసర్ జెఫ్ థామ్సన్ శిష్యరికంలో రాటు దేలాడు. థామ్సన్ చెప్పిన టిప్స్‌తో తెలివైన బౌలర్‌గా మారాడు. ప్రారంభంలో రన్స్ లీక్ చేసినా.. కంగారుపడకుండా ఎలా పుంజుకోవాలో నేర్చుకున్నాడు. అలాగే ఎంఆర్‌ఎఫ్ అకాడమీలో మరో ఆసీస్ గ్రేట్ గ్లెన్ మెక్‌గ్రాత్ సమక్షంలో శిక్షణ తీసుకోవడం కూడా ప్రసిధ్‌కు చాలా హెల్ప్ అయింది.

అలా వెలుగులోకి
11 ఏళ్లకే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకొని తొలుత టెన్నిస్ బాల్‌తో బేసిక్స్ నేర్చుకున్న 25 ఏళ్ల ప్రసిధ్ కృష్ణ.. ఇప్పటి వరకు 49 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడి 85 వికెట్లు తీశాడు. మరో 40 టీ20ల్లో 33 వికెట్లు పడగొట్టాడు. ఇక, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. 2015లో అతను ఫస్ట్ టైమ్ వెలుగులోకి వచ్చాడు. బంగ్లాదేశ్-ఎ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్నాటక రెగ్యులర్ పేసర్లు వినయ్ కుమార్, అభిమన్యు మిథున్ గైర్వాజరీలో కృష్ణకు చాన్స్ వచ్చింది. అప్పటికి టీనేజ్‌లోనే ఉన్న ప్రసిధ్ ఆ పోరులో ఐదు వికెట్లు పడగొట్టాడు. అక్కడి నుంచి అతను వెనుదిరిగి చూసుకోలేదు. విజయ్ హజారే ట్రోఫీలో రాణించడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.

కోహ్లీ దృష్టిని ఆకర్షించి..
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కీ బౌలర్‌గా మారిన ప్రసిధ్‌ను ఆ ఫ్రాంచైజీ తదుపరి సీజన్ కోసం కూడా రిటైన్ చేసుకుంది. అదే టైమ్‌లో డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఇండియా-ఎ టీమ్ తరఫున కూడా సత్తా చాటాడు. ఎన్‌సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ గైడెన్స్‌లో చాలా మెరుగైన ప్రసిధ్.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దృష్టిలో పడ్డాడు. టీమిండియాలో అతను ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని ఏడాది కిందటే కోహ్లీ అంచనా వేశాడు. అతని అంచనా తప్పుకాలేదు. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 14 వికెట్ల తీయడంతో ప్రసిధ్‌ను సెలెక్టర్లు టీమిండియాకు ఎంపిక చేశాడు. ఈ కర్ణాటక యువ పేసర్ గురించి పూర్తిగా అవగాహన ఉండటంతో కోహ్లీ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే అవకాశం ఇవ్వగా.. దాన్ని ప్రసిధ్ రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications