India vs England: ముగిసిన రెండో రోజు ఆట.. శతక్కొట్టిన పంత్, మెరిసిన సుందర్!

అహ్మదాబాద్: రిషభ్ పంత్(118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101) ధనాధన్ సెంచరీకి వాషింగ్టన్ సుందర్(117 బంతుల్లో 8 ఫోర్లతో 60 బ్యాటింగ్) సూపర్ ఫిప్టీ తోడవ్వడంతో ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఓ దశలో 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును ఈ యువ ఆటగాళ్లు 113 పరుగుల భాగస్వామ్యంతో గట్టెక్కించారు. దాంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 94 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. క్రీజులో సుందర్‌తో పాటు అక్షర్ పటేల్(11 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతానికి భారత్ 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్(3/40) మూడు, బెన్ స్టోక్స్(2/73), జాక్ లీచ్ (2/66) రెండేసి వికెట్లు తీశారు.

కోహ్లీ డకౌట్..
24/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. తొలుత ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా(17)ను జాక్ లీచ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీని బెన్ స్టోక్స్ డకౌట్ చేశాడు. అనూహ్యంగా దూసుకొచ్చిన షార్ట్‌పిచ్ బంతిని ఆడలేక కోహ్లీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, రహానే కొంత పోరాడినా జిమ్మీ దెబ్బతీశాడు. లంచ్ బ్రేక్ ముందు రహానేను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో భారత్ 80/4తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

రోహిత్ హాఫ్ సెంచరీ మిస్..
బ్రేక్ అనంతరం రోహిత్ శర్మను(49)ను స్టోక్స్ వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు. సూపర్ బాల్‌తో బోల్తాకొట్టించాడు. స్టోక్స్ వేసిన 50 ఓవర్ ఆఖరి బంతిని పుల్ చేయబోయిన హిట్‌మ్యాన్ వికెట్లు ముందు అడ్డంగా దొరికిపోయాడు. బంతి అనూహ్యంగా స్వింగ్ అవ్వడంతో అంచనా వేయలేకపోయాడు. దాంతో బ్యాట్‌ను మిస్సైన బంతి వికెట్ల వైపుగా దూసుకెళ్తూ హిట్‌మ్యాన్ ప్యాడ్లకు తగిలింది. దాంతో రోహిత్ హాఫ్ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ (13) కూడా దారుణంగా విఫలమయ్యాడు. లీచ్ బౌలింగ్‌లో పోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో భారత్ 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న పంత్, సుందర్..
ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సుంధర్‌తో పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఓపికగా ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. మరోవైపు సుంధర్ కూడా పంత్‌కు సహకారం అందించడంతో భారత్ 153/6తో టీ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం దూకుడు పెంచిన పంత్ 82 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక కొత్త బంతి తీసుకున్న తర్వాత పంత్ మరింత చెలరేగాడు. స్టోక్స్, అండర్సన్ బౌలింగ్‌లో కళ్లుచెదిరే బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో జోరూట్ వేసిన 84 ఓవర్ తొలి బంతిని స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన పంత్.. 115 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో కెరీర్‌లో మూడో సెంచరీని అందుకున్నాడు. అయితే జేమ్స్ అండర్సన్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించిన పంత్.. షార్ట్ మిడ్‌వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రూట్‌కు చిక్కాడు. దాంతో తీవ్ర నిరాశగా పెవిలియన్ చేరాడు.

సుంధర్ హాఫ్ సెంచరీ..
అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో(5 బ్యాటింగ్) సుంధర్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. పంత్ ఔటైనా.. ఏ మాత్రం జోరు తగ్గకుండా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే స్టోక్స్ వేసిన 87 ఓవర్ తొలి బంతిని ఫోర్, ఆ మరుసటి బంతికి క్విక్ డబుల్ తీసి కెరీర్‌లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా భారత ఆటగాళ్లు అవకాశం ఇవ్వలేదు. ఆచితూచి ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా రెండో రోజు ఆటను ముగించారు. ఇంకా మూడు వికెట్లు చేతిలో ఉన్న భారత్.. శనివారం వీలైనన్ని పరుగులు చేసి ఆధిక్యాన్ని పెంచుకుంటే మ్యాచ్‌పై మరింత పట్టు బిగిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications