గువాహటి: వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో భారత్-ఇంగ్లండ్ మధ్య గువాహటి వేదికగా జరగాల్సిన వామప్ మ్యాచ్‌కు వర్షం కారణంగా రద్దయ్యింది. టాస్ అనంతరం ప్రారంభమైన వర్షం విరామం లేకుండా కురుస్తోంది. దాంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పేసారు. వర్షం విరామం ఇవ్వకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని భావించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ముందుగా బ్యాటింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఎలాంటి కారణం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. బౌలర్లను ఫ్రెష్‌గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని, మధ్యాహ్నం ఎండలో బౌలింగ్ చేస్తే బౌలర్లు అలసిపోతారని చెప్పాడు. వామప్ మ్యాచ్ కేవలం సంప్రదాయమేనని, గత 7-8 మ్యాచ్‌లుగా మేం నిలకడగా రాణించామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఇదే మైదానం వేదికగా బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన వామప్ మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా జరిగింది. కానీ ఈ రోజు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తిరువనంతపురం వేదికగా అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయ్యింది.
అక్టోబర్ 3న నెదర్లాండ్స్ జట్టుతో తిరువనంతపురం వేదికగా భారత్ రెండో వామప్ మ్యాచ్ ఆడనుంది. వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌తో టీమిండియా తమ ప్రపంచకప్ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.