ఒక్క ఓవర్ హార్దిక్ పాండ్యాకు భారం అవుతుందా? ఏం మాట్లాడుతున్నావ్ కోహ్లీ.. సెహ్వాగ్ ఫైర్

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో ఎందుకు బౌలింగ్ చేయించలేదని ప్రశ్నించాడు. జట్టుకు అవసరమైనప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పాండ్యా బౌలింగ్ చేస్తాడని నిలదీశాడు. భవిష్యత్తు టోర్నీల దృష్ట్యా పాండ్యాపై పనిభారం తగ్గించేందుకు తాము అతనికి బౌలింగ్ ఇవ్వడం లేదన్న విరాట్ వ్యాఖ్యలను తప్పుబట్టాడు. అతని పనిభారాన్ని ఎలా పర్యవేక్షిస్తున్నారో తెలియడం లేదని, 50 ఓవర్లు ఫీల్డింగ్ చేసినా అలసిపోతారు కదా? అని ప్రశ్నించాడు.

ఓడినా ఫర్వాలేదా?
నేడు(ఆదివారం) జరిగే సిరీస్ డిసైడర్ వన్డేకు ముందు క్రిక్‌బజ్‌తో మాట్లాడిన సెహ్వాగ్.. విరాట్‌పై విమర్శలు గుప్పించాడు.'వన్డే సిరీస్ తర్వాత ఉన్నది ఐపీఎల్ మాత్రమే. అంటే హార్దిక్ పాండ్యాపై పనిభారం పర్యవేక్షణ కోసం సిరీస్ ఓడిపోయినా ఫర్వాలేదా? అతని పనిభారంలో కనీసం 4-5 ఓవర్లు లేకపోతే ఎలా? అతడి చేత ఒక్క ఓవర్ కూడా వేయించకూడదా? 50 ఓవర్ల ఫీల్డింగూ అలసటకు కారణమవ్వదా? 4-5 ఓవర్లు వేసినంత మాత్రానా అతనిపై ఎలాంటి పనిభారం పడదు' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ కోసం రిక్వెస్ట్ చేశాడా?
'హార్దిక్ పాండ్యా పనిభారం పెరుగుతోందని ఎవరు నిర్ణయిస్తున్నారో నాకైతే తెలియడం లేదు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత పునరాగమనం చేసి అతను ఎక్కువ క్రికెటేమీ ఆడలేదు. టెస్టులకు విశ్రాంతినిచ్చారు. 5 టీ20లు ఆడి 2-3 ఓవర్లే వేశాడు. అంటే అతను ఎక్కువ శ్రమించలేదు. బహుశా ఐపీఎల్ ముందు గాయపడకుండా జాగ్రత్త పడేందుకు వన్డేల్లో బౌలింగ్ చేయనని పాండ్యానే అడిగాడా? అనిపిస్తుంది' అని సెహ్వాగ్ సందేహించాడు.

భారత్‌కు బెయిర్ ‘స్టో'క్స్
రెండో వన్డేలో టీమిండియా నిర్దేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సునాయాసంగా ఛేదించింది. బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ ధాటికి భారత బౌలింగ్ తేలిపోయింది. పేసర్లు భువనేశ్వర్, ప్రసిద్ధ్ కృష్ణను మినహాయిస్తే మిగతా అందరి బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ చితకబాదారు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌ను ఊచకోత కోశారు. దాంతో జట్టుకు ఆరో బౌలర్ అవసరం ఏర్పడింది. మ్యాచ్ ఓడిపోతున్నా సరే హార్దిక్‌కు విరాట్ బంతినివ్వలేదు.

అందుకే బంతినివ్వలేదు..
పాండ్యా నైపుణ్యాల దృష్ట్యా మున్ముందు అతను జట్టుకు అత్యంత కీలకమని, అతనిపై పనిభారాన్ని పర్యవేక్షిస్తున్నామని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 'భవిష్యత్తు ప్రణాళిక దృష్యా హార్దిక్‌ను ప్రస్తుతం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేశాం. దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే రానున్న రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ ఆడనున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకొని అతనిపై ఎక్కువ పనిభారం వేయకూడదనే నిర్ణయానికి వచ్చాం' అని కోహ్లీ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications