సెంచరీ చేయలేదనే బాధ లేదు.. చేయాలనే ఆరాటం లేదు: విరాట్ కోహ్లీ

అహ్మదాబాద్: రికార్డుల రారాజు, రన్ మెషిన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గత కొంత కాలంగా సెంచరీ చేసింది లేదు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విరాట్.. 2019 వరకు మూడు ఫార్మాట్లలో కలిపి ప్రతీఏడాది కనీసం ఒక్క సెంచరినైనా నమోదు చేశాడు. కానీ గతేడాది మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. కరోనాకు పుణ్యమా అంతంతమాత్రంగానే క్రికెట్ జరగ్గా.. ఆడిన మ్యాచ్‌ల్లోనూ విరాట్ ఒక్క శతకం సాధించలేకపోయాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ తన మార్క్ పెర్ఫామెన్స్‌ను కనబర్చకపోయిన ఈ రన్ మెషిన్ ఆస్ట్రేలియా పర్యటనలోనూ నిరాశపరిచాడు. హాఫ్ సెంచరీలతో రాణించినా వాటిని శతకాలుగా మలచడంలో విఫలమయ్యాడు.
కనీసం 2021లోనైనా సెంచరీ సాధిస్తాడనుకుంటే అది లేదు. ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. అయితే తనకు సెంచరీ చేయాలేదనే బాధ, చేయాలనే ఆరాటం లేదని, జట్టుకు విజయం అందించడమే తన లక్ష్యమని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

నా బాధ్యత తెలుసు..
ఇంగ్లండ్‌తో మొతెరా మైదానం వేదికగా గురువారం నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో విరాట్ బుధవారం మీడియాతో వర్చువల్‌గా మాట్లాడాడు. ఈ సందర్భంగా సెంచరీ కరువుపై అతన్ని ప్రశ్నించగా.. పైవిధంగా స్పందించాడు. 'సెంచరీ చేయలేదనే బాధ కానీ చేయాలనే ఆరాటం కానీ లేదు. ఎందుకంటే ఓ బ్యాట్స్‌మన్‌గా నేను ఏ స్థాయిలో ఉన్నానో, ఎలా ఆడుతున్నానో, జట్టులో నా బాధ్యత ఏంటో బాగా తెలుసు. వ్యక్తిగత మైలురాళ్లు అందుకున్నప్పుడు జట్టు ప్రదర్శన బాగా లేకుంటే విమర్శకులు నా కెప్టెన్సీని తప్పుబడుతారు. ఒకవేళ జట్టు బాగా ఆడుతూ, బ్యాట్స్‌మన్‌గా నేను రాణించనప్పుడు వ్యక్తిగత పరుగులపై మాట్లాడుతారు. కాబట్టి నాకు ఇది ఎప్పటికే ఉండే సమస్యేనే'అని విరాట్ బదులిచ్చాడు.

జట్టు విజయమే..
భారత జట్టు కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా జట్టు విజయం కోసం పరుగులు చేయడమే తన ప్రధాన కర్తవ్యమని కోహ్లీ స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా జట్టుకు విజయాలందిస్తూ, వ్యక్తిగతంగా రాణిస్తూ వాటిలో కీలకపాత్ర పోషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నాడు. 'జట్టు విజయాలందించే ప్రక్రియలో వ్యక్తిగత మైలురాళ్లు అందుకుంటే చాలా బాగుంటుంది. అవి లేకుండా జట్టు గెలిచినా సంతోషమే. జట్టు విజయమే మా ప్రధాన లక్ష్యం. అది ఎప్పుడూ ఉంటుంది. అలాంటప్పుడు సెంచరీ చేయలేదనే బాధ ఎందుకుంటుంది'అని విరాట్ పేర్కొన్నాడు.

బంగ్లాదేశ్‌పై చివరిసారిగా..
2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డేనైట్ టెస్ట్‌లో చివరిసారిగా సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఆపై ఇప్పటివరకూ మరో శతకం సాధించలేదు. ఆ ఇన్నింగ్స్ తర్వాత మూడు ఫార్మాట్లలో కలిపి 35 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ సెంచరీ మార్క్ మాత్రం అందుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో 15 మ్యాచుల్లో 466 పరుగులు చేసిన కోహ్లీ.. ఇందులో 3 అర్ధశతకాలు సాధించాడు. ఓ మ్యాచ్‌లో 90 పరుగులతో అజేయంగా కూడా నిలిచాడు. ఆస్ట్రేలియా పర్యటన ఫస్ట్ టెస్ట్‌లో 72 పరుగులు చేసిన విరాట్ దాన్ని సెంచరీగా మలచలేకపోయాడు. ఇంగ్లండ్‌తో సెకండ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 62 పరుగులే చేశాడు.

గెలవడం కోసమే కదా..?
ఇక మొతెరా వేదికగా జరిగిన డే/నైట్ టెస్ట్ రెండు రోజుల్లో ముగియడంతో పిచ్‌పై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయితే వీటిని విరాట్ తనదైనశైలిలో తిప్పికొట్టాడు. అసలు టెస్ట్‌లు ఆడేది గెలవడం కోసమా? లేక ఐదు రోజులు ఆడేందుకా? అని ప్రశ్నించాడు. 'మీ అందిర్ని ఒక్కటే ప్రశ్న అడుగుతా.. గెలవడం కోసం మ్యాచ్ ఆడుతామా? లేక ఐదు రోజుల ఆట కొనసాగాలని ఆడుతామా? న్యూజిలాండ్ చేతిలో మేం ఓడిన రెండు మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగిసాయి. అప్పుడు ఏ ఒక్కరు కూడా పిచ్ గురించి మాట్లాడలేదు. అప్పుడంతా బ్యాట్స్‌మన్ నైపుణ్యంపైనే చర్చించారు. కానీ పిచ్ గురించి కాదు. టెస్ట్ క్రికెట్ స్పిన్ ట్రాక్‌లను ఎదుర్కోవడం కూడా కీలకమనే విషయాన్ని అందరికి తెలియజేయాలి. ఎప్పుడైనా ఆటలో మన బలాలపైనే దృష్టిసారించాలి. కానీ పిచ్‌పై కాదు.'అని విరాట్ అసహనం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications