ఆ టైమ్‌లో తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యా.. ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడిని అనిపించింది: కోహ్లీ

అహ్మదాబాద్: 2014 ఇంగ్లండ్ టూర్‌లో తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆ పర్యటనలో దారుణంగా విఫలమవడంతో ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడినని అనిపించిందన్నాడు. ఆ సిరీస్‌లో ఐదు టెస్టుల్లో కోహ్లీ వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు మాత్రమే చేశాడు. 10 ఇన్నింగ్సుల్లో 13.50 యావరేజ్‌తో 135 పరుగులు మాత్రమే సాధించాడు. ఆ టూర్ తర్వాత ఆసీస్‌కు వెళ్లిన విరాట్ అక్కడ 692 పరుగులు చేసి తిరిగి గాడిలో పడ్డాడు. అయితే తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ నిర్వహించిన 'నాట్ జస్ట్ క్రికెట్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన భారత కెప్టెన్.. తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన దశను వివరించాడు.

మానసికంగా కుంగిపోయా..
'నేను కూడా డిప్రెషన్‌కు గురయ్యాను. పరుగులు చేయలేకపోతున్నామనే బాధ చాలా కష్టంగా ఉంటుంది. దాదాపు చాలా మంది బ్యాట్స్‌మెన్ ఇది అనుభవించి ఉంటారు. ఇలాంటి సమయంలో ఏదీ మన అదుపులో ఉండదు. దీని నుంచి ఎలా బయటపడాలో అస్సలు తెలియదు. ఇంగ్లండ్ టూర్‌లో నేనది అనుభవించా. ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడినేమో అనిపించింది. మాట్లాడేందుకు మనుషులు లేరని కాదు. నా మనసులో ఏముందో పూర్తిగా అర్థం చేసుకొనే ఎక్స్‌పర్ట్ లేరనిపించింది.' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

నిర్లక్ష్యం చేయవద్దు..
మానసిక సమస్యలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని విరాట్ కోహ్లీ తెలిపాడు. 'డిప్రెషన్‌కు గురైనప్పుడు మన ఆలోచనలు పంచుకోవడానికి ఒకరు ఉండాలి. నిద్రపోవడమూ కష్టంగా ఉంది. పొద్దున్నే లేవాలనిపించడం లేదు. నాపై నాకు నమ్మకం ఉండటం లేదు. వీటిని పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి? అని ఇతరులతో షేర్ చేసుకోవాలి. కొందరు ఇలాంటి అనుభవాలతోనే సుదీర్ఘ కాలం గడుపుతారు. ఒక్కోసారి క్రికెట్ సీజన్ అంతా ఇలాగే బాధపడతారు. దాన్నుంచి తప్పించుకోలేరు. ఇలాంటప్పుడు మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి' అని పేర్కొన్నాడు.

అప్పుడే డిసైడ్ అయ్యా..
1990ల్లో భారత జట్టును చూసి క్రికెట్లోకి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నానని కోహ్లీ తెలిపాడు. '90ల్లోని భారత జట్టు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు
ప్రేరేపించింది. నమ్మకం, నిర్ణయం ఉంటే అద్భుతాలు జరుగుతాయని నన్ను నేను విశ్వసించాను. దేశం తరఫున ఆడాలన్న కసి రగిలింది. 18 ఏళ్ల వయసులో మా నాన్న మరణించారు. ఆ సంఘటన నాపై విపరీతంగా ప్రభావం చూపించింది. నా అంతరంగంలోకి నేను చూసుకొన్నాను. బాల్యంలో క్రికెట్ ఆడేటప్పుడు మా నాన్న చాలా కష్టపడ్డారు. ఏదేమైనా నా కల నెరవేరుతుందని, దేశం తరఫున అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడటం నిజమవుతుందని అప్పుడే గట్టిగా అనుకున్నాను' అని విరాట్ చెప్పుకొచ్చాడు.

నాకు నచ్చినట్లు..
నిజ జీవితంలోనూ మైదానంలో ఉన్నట్టే ఉంటానని కోహ్లీ తెలిపాడు. 'ఇతరుల కోణంలో నా అభిప్రాయాలు చూసుకోను. సొంతంగా పనిచేసుకుంటూ వెళ్తాను. వ్యక్తిగతంగా నేనేం చేస్తానన్నదే నాకు ముఖ్యం. అలాగే మైదానంలోనూ కృషి చేస్తాను. కొంతమంది ముందు బాగా కనిపించాలని భావించను. నేనలాంటి వ్యక్తిని కాను. అంచనాల విషయానికి వస్తే వాటి గురించి ఆలోచిస్తే భారంగా అనిపిస్తుంది' అని విరాట్ తెలిపాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో బుధవారం నుంచి అహ్మదాబాద్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications