టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తా: విరాట్ కోహ్లీ

అహ్మదాబాద్: అప్‌కమింగ్ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తానని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంలో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 నాటౌట్) దుమ్మురేపాడు. రోహిత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ముగ్గురు సహచరులతో వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్సి భారత్ భారీ స్కోర్ చేయడం కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ విజయానంతరం మాట్లాడిన కోహ్లీ టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.
సానుకూల దృక్పథంతో..
రోహిత్‌తో కలిసి మళ్లీ ఓపెనింగ్ చేస్తానని చెప్పాడు. 'ఇది మాకు సంపూర్ణమైన విజయం. ప్రత్యర్థిపై అన్ని విభాగాల్లోనూ అదరగొట్టాం. డ్యూ ప్రభావం అధికంగా ఉన్నా గత మ్యాచ్‌లాగే లక్ష్యాన్ని కాపాడుకున్నాం. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే 224 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించాం.
మా బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఈ మా ఇన్నింగ్స్ ఓ నిదర్శనం. ఈ రోజు నేను, రోహిత్ సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాం. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉందని తెలుసు. దాంతో ఒకరు చెలరేగితే, మరొకరు నిలకడగా ఆడాలని అనుకున్నాం. తర్వాత సూర్య, హార్దిక్ మ్యాచ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లారు.
ఐపీఎల్‌లోనూ ఓపెనింగ్..
ఐపీఎల్‌లోనూ నేను ఓపెనింగ్ చేస్తా. గతంలో వివిధ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం నాకుంది. అయితే, ఇప్పుడు మాకు బలమైన మిడిలార్డర్ ఉంది. ఇకపై రోహిత్‌తో కలిసి కచ్చితంగా ఓపెనింగ్ చేస్తా. టీ20 ప్రపంచకప్‌లో అతనితో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తా. మా ఇద్దరిలో ఎవరు నిలిచినా ఇతర బ్యాట్స్‌మెన్‌కు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది జట్టుకు ఎంతో లాభం చేకూరుస్తుంది.
శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఫస్ట్ మ్యాచ్‌లో బాధ్యతగా ఆడాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాట్స్‌మన్. సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పనక్కర్లేదు. భువనేశ్వర్ కుమార్ మళ్లీ గాడిలో పడ్డాడు. రిషభ్ పంత్ కూడా ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత శార్దూల్ ఠాకూర్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అతను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు' అని కోహ్లీ కొనియాడాడు.

విరా‘రోహి'ట్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ (34 బంతుల్లో4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులే చేసి ఓటమిపాలైంది.
డేవిడ్ మలాన్ (46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), జోస్ బట్లర్ (34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు 52) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో పొదుపైన బౌలింగ్‌తో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' భువనేశ్వర్ (2/15) జట్టును గెలిపించాడు. భారత కెప్టెన్ కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications