India vs England: చెలరేగిన విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ ముందు పోరాడే లక్ష్యం!

అహ్మదాబాద్: స్టార్ బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ కెప్టెన్ విరాట్ కోహ్లీ(46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్ ) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లండ్ ముందు భారత్ 157 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లు ధాటికి 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. ఓ దశలో 120 పరుగులైనా చేస్తుందా? అనే సందేహం కలిగింది. కానీ యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్(25) సాయంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ పోరాడాడు. చివర్లో అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా(17) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(3/31) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్(2/35) రెండు వికెట్లు పడగొట్టాడు.

ప్చ్.. టాప్-3 విఫలం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్ తన వరుస ఓవర్లలో భారత ఓపెనర్లిద్దరిని పెవిలియన్ చేర్చాడు. మూడో ఓవర్‌లో కేఎల్ రాహుల్(0) క్లీన్ బౌల్డ్ చేసిన మార్క్ వుడ్.. తన మరుసటి ఓవర్‌లో రోహిత్ శర్మ(15)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే గత మ్యాచ్ విన్నర్ ఇషాన్ కిషన్(4) కూడా జోర్డాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో భారత్ పవర్ ప్లే ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.

ఆదుకున్న కోహ్లీ-పంత్..
ఈ క్లిష్ట స్థితిలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. మంచి బంతులను గౌరవిస్తూ చెడ్డబంతులను బౌండరీలకు తరలించారు. అయితే పిచ్‌పై లభించిన ఎక్స్‌ట్రా బౌన్స్‌ను సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. దాంతో 50 పరుగులు చేయడానికి భారత్ 56 బంతులు ఎదుర్కొంది. భారీ షాట్లు ఆడటానికి ఇబ్బంది పడ్డ ఈ జోడి క్విక్ సింగిల్స్, డబుల్స్‌పై దృష్టి సారించింది. అయితే ఈ ఇద్దరు లేని పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నారు. మంచి టచ్‌లోకి వచ్చిన రిషభ్ పంత్(25) కోహ్లీ అత్యుత్సాహం కారణంగా రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో 4 వికెట్‌కు నమోదైన 44 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
కోహ్లీ హాఫ్ సెంచరీ..
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(9) కూడా విఫలమవ్వగా.. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి విరాట్ కోహ్లీ ధాటిగా ఆడాడు. జోర్డాన్ వేసిన 17 ఓవర్ ఆఖరి బంతిని డీప్ మిడ్ వికెట్‌గా బౌండరీ తరలించిన కోహ్లీ.. 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతనికిది వరుసగా రెండో హాఫ్ సెంచరీ. వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్.. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో వాటిని తిప్పికొట్టాడు.

చివర్లో చెలరేగి..
హాఫ్ సెంచరీ అనంతర మరింత ధాటిగా ఆడిన విరాట్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మార్క్ వుడ్ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు ఒక ఫోర్‌తో 17 పరుగులు పిండుకున్నాడు. 19వ ఓవర్‌లో పాండ్యా ఓ సిక్స్ కొట్టగా.. విరాట్ బౌండరీ రాబట్టడంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టగా.. కోహ్లీ ఓ ఫోర్ కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి బంతిని భారీ షాట్ ఆడిన హార్దిక్ పాండ్యా(17).. జోఫ్రా ఆర్చర్ సూపర్ క్యాచ్‌కు ఔటయ్యాడు. చివరి 5 ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేయడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications