
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలోని భారత జట్టులో కరోనా కలకలం రేపింది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించినట్లు సమాచారం. అయితే ఆ ఇద్దరు ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు. మిగతా ఆటగాళ్లందరూ డర్హమ్‌లో ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ముందుగా ఓ ప్లేయర్‌కు గొంతునొప్పి సమస్య రాగా.. ముందుస్తు చర్యల్లో భాగంగా కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చిందంట. అతనితో సన్నిహితంగా ఉన్న ఇతర ఆటగాళ్లు, సిబ్బందిని కూడా ఐసోలేషన్ తరలించినట్లు తెలుస్తోంది. ఇక ఏఎన్‌ఐ సమాచారం ప్రకారం ఇద్దరి ఆటగాళ్లలో ఒకరికి కరోనా వచ్చి పూర్తిగా తగ్గిందని పేర్కొంది. మరొకరికి వచ్చే ఆదివారం పరీక్షలు జరుపుతారని తెలిపింది. కరోనా బారిన ఇద్దరు ప్లేయర్లకు పెద్దగా లక్షణాలు లేవని, కొద్దిగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
'ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కరోనా బారిన పడిన ఓ ఆటగాడు పూర్తిగా కోలుకున్నాడు. మరో ప్లేయర్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఆదివారం అతనికి మరోసారి కరోనా టెస్ట్ చేయనున్నారు. అతనికి ఎలాంటి లక్షణాలు లేవు. నెగటీవ్ రిపోర్ట్ వస్తుందనే ధీమాతో మేమంతా ఉన్నాం.'అని టీమ్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. టీమ్ వర్గాలను హెచ్చరిస్తూ బీసీసీఐ సెక్రటరీ జై షా లేఖ రాసినట్లు తెలుస్తోంది. బయో బబుల్ నిబంధనలను కఠినంగా పాటించాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం. విరాట్ కోహ్లీ నేతృత్వంలో 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ఆరు వారాల సమయం ఉండటంతో బీసీసీఐ భారత ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది.
దాంతో బయో బబుల్ ధాటిన ఆటగాళ్లు ఈ విరామ సమయాన్ని ఆస్వాదించారు. ఇంగ్లండ్ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. వింబుల్డన్, యూరో 2020 మ్యాచ్‌లను తిలకించారు. అయితే అక్కడ డెల్టా వేరియంట్ కేసులు పెరిగాయి. శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం ఇంగ్లండ్ జట్టులో ఏడుగురు కరోనా బారిన పడగా.. శ్రీలంకలో ఇద్దరికి పాజిటీవ్ వచ్చింది.