
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన ఫస్ట్ వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా కిందపడ్డ అయ్యర్ ఎడమ భుజం డిస్‌లోకేట్ అయ్యింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఏనిమిదో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో కొట్టిన షాట్‌ను అడ్డుకునే క్రమంలో డైవ్ చేసిన అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే టీమ్ ఫీజియోలు వచ్చి గాయాన్ని పరీక్షించగా.. దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి సూచనల మేరకు మైదానం వీడాడు. అతన్ని స్కానింగ్ కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో మిగిలిన సిరీస్‌కు అయ్యర్ దూరమయ్యే చాన్స్ ఉంది. గాయం తీవ్రమైతే ఐపీఎల్‌లో కూడా ఆడటం కష్టం కావొచ్చు. ఇదే మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా అతని కుడి మోచేతికి బంతి బలంగా తాకింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో రోహిత్ ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శిఖర్ ధావన్ (106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98) సెంచరీ చేజార్చుకోగా... కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 నాటౌట్), కృనాల్ పాండ్యా (31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 నాటౌట్), కోహ్లీ (60 బంతుల్లో 6 ఫోర్లతో 56) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (66 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 94) టాప్ స్కోరర్ కాగా, జేసన్ రాయ్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) రాణించాడు. ప్రసిధ్ కృష్ణకు 4, శార్దుల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే శుక్రవారం ఇదే వేదికగా జరుగనుంది.