
ఆదిలోనే షాక్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 20 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోర్ రెండు పరుగుల వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ (1) ఔట్ అయ్యాడు. పేసర్ జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. సుదీర్ఘకాలం తర్వాత టీమిండియా తరఫున మ్యాచ్ ఆడుతున్న రాహుల్.. తొలి టీ20లో పూర్తిగా నిరాశపరిచాడు. ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్రిస్ జోర్డాన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

విఫలమైన ధావన్, పంత్
విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరిన కాసేపటికే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (4) మార్క్‌వుడ్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. ఆపై శ్రేయాస్ అయ్యర్ అండతో రిషబ్ పంత్ బ్యాట్ జుళిపించాడు. కొన్ని మంచి షాట్లు ఆడాడు. ఆరంభం నుంచే దూకుడుగా కనిపించిన పంత్.. 10 ఓవర్లో పెవిలియన్ చేరాడు. స్టోక్స్ బౌలింగ్‌లో డీప్ స్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో భారమంతా శ్రేయాస్ అయ్యర్‌పైనే పడింది. హార్దిక్ పాండ్యా అండతో అయ్యర్ జట్టు స్కోరును ముందుకు నడిపాడు.

అయ్యర్ హాఫ్ సెంచరీ
శ్రేయాస్ అయ్యర్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. మరోవైపు హార్దిక్ మంచి సహకారం అందించాడు. అయితే ఆర్చర్ వేసిన 18వ ఓవర్ రెండో బంతికి జోర్డాన్‌కు క్యాచ్ ఇచ్చి పాండ్యా అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్ కు 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ (0) భారీ షాట్ ఆడబోయి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జోర్డాన్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద మలాన్ క్యాచ్‌కు అయ్యర్ పెవిలియన్ చేరాడు. ఆపై అక్షర్ ఓ బౌండరీ బాది భారత్ స్కోరును 120 పరుగులు దాటించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో చెలరేగగా.. రషీద్, స్టోక్స్, జోర్డాన్, మార్క్‌వుడ్ తలా ఓ వికెట్ తీశారు.

ఇదే తొలిసారి
అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ వరుసగా రెండు డకౌట్లు అవ్వడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ 8 బంతులు ఆడిన విరాట్.. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో సున్నా పరుగులకే వెనుదిరిగాడు. ఇక 2021లో ఎక్కువ సార్లు డకౌట్లు అయింది కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం. కోహ్లీ ఇప్పటివరకు మూడు సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. జానీ బెయిర్‌స్టో, కుశాల్ మెండిస్, అన్రిచ్ నార్జ్ కూడా 2021లో మూడుసార్లు డకౌట్లు అయ్యారు.
Qatar Open 2021: దుబాయ్ టోర్నమెంట్ నుంచి వైదొలిగిన ఫెడరర్... అసలు కారణం ఇదే!!


Click it and Unblock the Notifications












