ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా నేటి(గురువారం) రాత్రి జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో టీమిండియా అజేయంగా నిలిస్తే.. సూపర్-8 పోరులో ఇంగ్లండ్ దుమ్మురేపింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా ఇప్పటి వరకు సాధికారిక ప్రదర్శన చేయలేకపోయింది.
వెస్టిండీస్‌తో క్వార్టర్ ఫైనల్ తరహా సూపర్-8 పోరులో సంజూ శాంసన్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయం సాధించింది. అదే జోరును సెమీఫైనల్లో కొనసాగించి ఫైనల్ చేరాలనే పట్టుదలతో సూర్యసేన ఉంది. మరోవైపు ఇంగ్లండ్ సూపర్ ఫామ్‌లో ఉన్నా.. పొట్టి ఫార్మాట్‌లో ఆ జట్టుపై టీమిండియాకు మంచి రికార్డ్ ఉంది. దాంతో ఈ రెండు బలమైన జట్ల మధ్య పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టీమిండియాకు అచ్చొచ్చిన వాంఖడే మైదానంలో సెమీస్ మ్యాచ్ జరగనుండటం కలిసొచ్చే అంశం. సంజూ శాంసన్ ఫామ్ అందుకోవడం జట్టుకు కలిసొచ్చే అంశం. అతనికి తోడుగా అభిషేక్ శర్మ కూడా చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. ఆరంభంలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత ప్రభావం చూపలేకపోయాడు. పరుగుల వేటలో వెనుకబడ్డాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఈ ముగ్గురిలో ఇద్దరు చెలరేగినా టీమిండియా భారీ స్కోర్ చేయడం ఖాయం.

చిన్న జట్లపై మాత్రమే ఆడుతాడనే పేరును చెరిపేసేందుకు హార్దిక్ పాండ్యాకు ఇది మంచి అవకాశం. బ్యాట్‌తో పాటు బంతితో అతను సత్తా చాటితే టీమిండియా విజయం నల్లేరు మీద నడకే. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ గత మూడు మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపర్చాడు. వికెట్లు తీస్తున్నా ధారళంగా పరుగులిస్తున్నాడు. అయితే ఇంగ్లండ్‌పై అతనికి మెరుగైన రికార్డ్ ఉంది. తిరిగి లయ అందుకోవడానికి ఈ మ్యాచ్ సువర్ణవకాశం. అతను గతి తప్పితే మాత్రం టీమిండియాకు కష్టాలు తప్పవు.
బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా.. అర్ష్‌దీప్ సింగ్ పరుగులు కట్టడి చేయడంపై ఫోకస్ పెట్టాలి. టీమిండియా ఫీల్డింగ్ కూడా చాలా మెరుగవ్వాలి. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఏ చిన్న తప్పిదం చేసినా మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తోంది. తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం లేదు. గత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది.
భారత్, ఇంగ్లండ్‌కు ఇది వరుసగా మూడో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్. 2022లో భారత్‌ను ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో చిత్తు చేస్తే.. 2024 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 69 పరుగుల భారీ తేడాతో భారత్ మట్టికరిపించింది. ఈ రెండు సందర్భాల్లో సెమీఫైనల్ గెలిచిన జట్లే టోర్నీ విజేతగా నిలిచాయి. ఈ సారి కూడా తాజా సెమీఫైనల్ గెలిచిన జట్టుకే టైటిల్ దక్కుతుందా? అనేది చూడాలి.
ముఖా ముఖి పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియాదే పైచేయి. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా 17-12తో ఇంగ్లండ్‌పై ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌తో ఆడిన గత 6 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ ఐదు గెలిచింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌పై 10 గెలిచిన భారత్.. 6 మ్యాచ్‌ల్లో ఓడింది. ప్రపంచకప్‌లోనూ భారత్‌దే ఆధిపత్యం. ఐదు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో (2007, 2012, 2024) భారత్ మూడు గెలిచింది. మరో రెండింటిలో(2009, 2022)లో ఓటమిపాలైంది.
గ్రూప్ దశలో వెస్టిండీస్-ఇంగ్లండ్, నేపాల్-ఇటలీ మ్యాచ్‌లకు ఉపయోగించిన పిచ్‌పైనే ఈ సెమీస్ మ్యాచ్ జరగనుంది. అయితే ఫిబ్రవరి 12 తర్వాత ఈ పిచ్‌ను ఉపయోగించలేదు. ఒకరకంగా ఇది తాజా పిచ్. పిచ్‌పై కాస్త పచ్చి ఉన్నప్పటికీ.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. మంచి బౌన్స్‌తో పాటు స్పిన్నర్లకు ఓ మోస్తరుగా టర్న్ లభిస్తుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. డ్యూ ప్రభావం ఉండనుంది.
