
అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగానే టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20కి దూరమయ్యాడు. శుక్రవారం మొతేరా మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో రోహిత్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆఖరి నిమిషంలో రోహిత్ తప్పించడంతో అతనికి గాయమైందేమో అనుకున్నారంతా. కానీ, రొటేషన్ పద్ధతిలో భాగంగా హిట్‌మ్యాన్‌కు విశ్రాంతినిచ్చారని తర్వాత తెలిసింది.
ప్రపంచకప్ దిశగా సన్నాహాలు మొదలుపెట్టిన భారత్.. ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించే ఉద్దేశంతో రొటేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు జట్టు వర్గాల పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్‌కు రోహిత్‌ను దూరం పెట్టారు. టాస్ సందర్భంగా కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రోహిత్‌కు విశ్రాంతినిచ్చినట్లు తెలిపాడు. గురువారం జరిగిన ప్రెస్‌మీట్‌లో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వస్తాడని చెప్పిన కోహ్లీ.. ధావన్‌కు చాన్స్ లేదన్నట్టు హింట్స్ ఇచ్చాడు. కానీ తుది జట్టులో రోహిత్‌కే చాన్స్ ఇవ్వలేదు.
భారత్ ఉద్దేశం ఏదైనప్పటికీ.. ఫామ్‌లో ఉన్న రోహిత్ దూరం కావడం తొలి మ్యాచ్‌లో భారత్‌కు చేటు చేసింది. ముంబైకర్ లేనిలోటు స్పష్టంగా కనిపించింది. రొటేషన్‌లో భాగంగా తర్వాతి మ్యాచ్‌ల్లో మరికొందరు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే అవకాశముంది. రాబోయే మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లకు ఛాన్సులు రావడం ఖాయం. అయితే టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ చేసిన తప్పిదమే.. టీ20 సిరీస్‌లో భారత్ చేసిందని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. రొటేషన్ పాలసీ పేరిట ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పక్కనపెట్టడం అంతమంచిది కాదన్నారు.
ఇక ఇంగ్లండ్‌ను స్పిన్ ఉచ్చులో బిగించాలనుకున్న భారత వ్యూహం బెడిసి కొట్టింది. దాంతో భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తయింది. స్పిన్నర్లపై బ్యాట్ ఝుళిపించిన జేసన్ రాయ్ (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సునాయాస విజయా న్నందించాడు. ముందుగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (48 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. ఇంగ్లండ్ పేసర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జోఫ్రా ఆర్చర్ 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. ఆదివారం రెండో టి20 ఇక్కడే జరుగుతుంది.