
అహ్మదాబాద్: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో 9 వేల పరుగుల క్లబ్‌లో చేరిన రెండో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో హిట్‌మ్యాన్ ఈ రికార్డు అందుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ వేసిన తొలి ఓవర్ తొలి బంతినే సిక్స్‌గా మలిచిన రోహిత్.. అదే ఓవర్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ఈ జాబితాలో టీమిండియా తరఫున కెప్టెన్ విరాట్ కోహ్లీ(9,650) ముందు వరుసలో ఉండగా, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(9006) సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. వీరి తర్వాత సురేశ్ రైనా (8494) రన్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓవరాల్‌గా టీ20ల్లో ఈ రికార్డు సాధించిన ఆటగాళ్లలో రోహిత్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(12) త్వరగానే ఔటైనా.. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) సూపర్ ఫిఫ్టీకి తోడుగా రిషభ్ పంత్(23 బంతుల్లో 4 ఫోర్లతో 30), శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 37) ధాటిగా ఆడటంతో భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది.
ప్రత్యర్థి బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్, సామ్ కరన్ తలో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాలు భారత్ భారీ స్కోర్‌కు అడ్డుగా నిలిచాయి. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 12 ఓవర్లలో 3 వికెట్లకు 91 పరుగులు చేసింది.