ఆ స్టార్ ఓపెనర్‌కు గాయమా?.. నో ప్రాబ్లమ్.. యువ ఆటగాళ్లతో బలంగా టీమిండియా!

హైదరాబాద్: భుజ గాయంతో శ్రేయస్ అయ్యర్ దూరం.. చేతి వేలి గాయంతో రోహిత్ శర్మ గైర్హాజరు.. అయితేనేం టీమిండియాకు వచ్చిన ఇబ్బందేం లేదు. ఎందుకంటే యువ ఆటగాళ్లతో జట్టు బలంగా ఉంది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే పటిష్టమైన జట్టుగా రూపొందింది. స్వదేశీ, విదేశీ అని తేడా లేకుండా అన్ని చోట్లా విజయకేతనం ఎగరవేస్తోంది.
సీనియర్ క్రికెటర్లు గాయాల పాలైనా.. విశ్రాంతి కోసం దూరమైనా.. వారి స్థానాలను భర్తీ చేసేందుకు యువ క్రికెటర్లు సిద్దంగా ఉన్నారు. అరంగేట్రం మ్యాచ్ నుంచే దుమ్ము దులిపేస్తున్నారు. షమీ, బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు లేకున్నా భారత్ ఏ మాత్రం తడబడకుండా టెస్ట్, టీ20 సిరీస్ నెగ్గింది. మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది.

నో టెన్షన్..
తొలి వన్డే ముగిసిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... ఈ విజయం తమకు ఒక తీపి గుర్తన్నాడు. అంతేకాకుండా జట్టు కూర్పుపై కూడా సంతోషం వ్యక్తం చేశాడు. జట్టులో ఇప్పుడు పోటీ పెరిగిపోయిందని.. ఒక్కో స్థానానికి ఇద్దరు ముగ్గురు అందుబాటులో ఉన్నారని విరాట్ చెప్పుకొచ్చాడు. అతని మాటల్లో ఆనందం వెనుక బీసీసీఐ ఏళ్ల కృషి ఉంది. ఒకప్పుడు ఎవరైనా బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్ గాయపడితే వారి స్థానాన్ని భర్తీ చేయడానికి క్రికెటర్లను వెతకాల్సి వచ్చేది. యువ క్రికెటర్లతో భర్తీ చేయాలనుకుంటే.. వాళ్లు ఒత్తిడికి తట్టుకోలేక విఫలమయ్యేవాళ్లు.

ఐపీఎల్‌తోనే..
అయితే ఐపీఎల్ తర్వాత పరిస్థితి మారింది. ఐపీఎల్ మ్యాచ్‌లు సైతం అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఏ మాత్రం తక్కువగా ఉండవు. అంతేకాకుండా దేశ, విదేశాలకు చెందిన సీనియర్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంతో వారి అనుభవం కలిసివస్తోంది.
ఈ అనుభవంతోనే తమ అరంగేట్ర మ్యాచ్‌ల్లోనే ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, ప్రసిధ్ కృష్ణ దుమ్మురేపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్రికెటర్లతో టీమిండియా రెండు బలమైన జట్లను తయారు చేయవచ్చనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఒక్కో ప్లేస్‌కు ఇద్దరు..
ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో కోహ్లీ ఓపెనింగ్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జట్టు అవసరాల కోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు రెడీ అని చెప్పాడు. 2019 ప్రపంచకప్ ముందు వరకు 4వ స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్ దొరకక టీమిండియా చాలా ఇబ్బందులు పడింది. సురేశ్ రైనా జట్టు నుంచి వెళ్లిపోయాక ఆ చోటు భర్తీ అంత త్వరగా సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు ఆ స్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నారు. అవసరమైతే ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సూర్య కూడా సిద్దంగా ఉన్నాడు.

ఫలించిన బీసీసీఐ వ్యూహం..
ఓపెనర్లుగా రోహిత్, ధావన్ మాత్రమే కాకుండా బ్యాకప్‌గా శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల సిద్దంగా ఉన్నారు. ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా లేకపోయినా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుంధర్ ఆ బాధ్యతలు నిర్వర్తించగలరు. ఇప్పుడు కృనాల్ పాండ్యా కూడా ఆల్‌రౌండర్స్ జాబితాలో చేరాడు. తమ్ముడితోనే పోటీకి సై అంటున్నాడు.
కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ కీపర్లుగా కొనసాగుతుండగా.. వారికి ఇషాన్ కిషాన్ పోటీకి వస్తున్నాడు. భువనేశ్వర్‌కు తోడుగా బుమ్రా, షమీ లేకపోయినా నట్టూ, శార్దూల్, ప్రసిధ్ దుమ్మురేపుతున్నారు. బెంచ్‌పై సైనీ, సిరాజ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. బీసీసీఐ వ్యూహాలు ఫలించడం టీ20 ప్రపంచకప్ ముందు కలిసి వచ్చే అంశం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications