
విరాట్ కోహ్లీపై సెటైర్స్..
నాలుగో టీ20 చివర్లో గాయంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానం వీడగా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును నడిపించాడు. ఇంగ్లండ్ విజయానికి చివరి 24 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో రోహిత్ శర్మ తన బుర్రకు పదును పెడుతూ మార్క్ కెప్టెన్సీని ప్రదర్శించాడు. అతను బౌలర్లను వినియోగించిన తీరు, ఫీల్డర్ల మార్పు మెరుగైన ఫలితాల్ని ఇచ్చింది. అప్పటి వరకూ ప్రమాదకరంగా కనిపించిన బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్‌లను కట్టడి చేసేందుకు శార్ధూల్ ఠాకూర్‌కి బంతినివ్వగా.. అతను వరుసగా రెండు బంతుల్లో ఆ ఇద్దరినీ ఔట్ చేశాడు. దాంతో భారత్ విజయం లాంఛనమైంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ మైకేల్ వాన్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు.

విరాట్‌పై సెటైర్స్..
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అద్భుతమని, సరైన సమయంలో రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించడం జట్టుకు లాభం చేకూర్చిందని వాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'విరాట్ నుంచి గొప్ప కెప్టెన్సీ.. సరైన సమయంలో రోహిత్‌కు జట్టు పగ్గాలు అందించాడు. అతని చిట్కాలు బాగా పనిచేశాయి'అని ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా భారత జట్టులో సగం మంది ముంబై ఇండియన్స్ ఆటగాళ్లే ఉన్నారని ట్వీట్ చేశాడు. 'సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కెప్టెన్ రోహిత్ శర్మ ముగ్గురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లే.'అని పేర్కొన్నాడు. పైగా ఈ ముగ్గురు అద్భుత ప్రదర్శన కనబర్చారని నొక్కి చెప్పాడు. అయితే ఫస్ట్ టీ20లో ఇంగ్లండ్ విజయానంతరం భారత జట్టు కన్నా ముంబై ఇండియన్స్ టీమ్ ఎంతో నయమని వాన్ ట్వీట్ చేశాడు. ఆ క్రమంలోనే మళ్లీ ముంబై ఇండియన్స్ ప్రస్తావన తీసుకొచ్చాడు.
ఫ్యాన్స్ ఫైర్..
ఇక మైకేల్ వాన్ సెటైర్స్‌పై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా అతనికి దిమ్మతిరిగే బదులిస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లే అయినా భారత్‌కు చెందినవారేనని కానీ, ఇంగ్లండ్ మాత్రం ఇతర దేశాల ఆటగాళ్లతో బరిలోకి దిగుతుందని చురకలంటిస్తున్నారు. 'ఇయాన్ మోర్గాన్-ఐర్లాండ్, బెన్ స్టోక్స్-న్యూజిలాండ్, జోఫ్రా ఆర్చర్-వెస్టిండీస్, క్రిస్ జోర్డాన్-వెస్టిండీస్, రషీద్ -పాకిస్థాన్, జాసన్ రాయ్ సౌతాఫ్రికా.. మీ జట్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎంత మంది? అని వాన్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. వాన్.. భారత్ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని, అతనికి ఎక్కడో కాలుతుందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు.
నీ జట్టును నీవే తిడుతున్నావ్?
ఇక మైకేల్ వాన్ ట్వీట్‌పై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా తనదైన శైలిలో బదులిచ్చాడు. 'మీ జట్టు నేషనల్ టీమ్ చేతిలో ఓడలేదని, ఫ్రాంచైజీ జట్టుతో ఓడామని చెప్పడం ద్వారా నువ్వు ప్రత్యర్థి జట్టును ట్రోల్ చేయడంలో లేదు. నీ జట్టును నీవే విమర్శిస్తున్నావు. అంతేకాకుండా అవనసరంగా తిట్టిచ్చుకుంటున్నావ్'అని వసీం జాఫర్ తనదైన శైలిలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలవగా.. కీలక డిసైడర్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగానే శనివారం జరగనుంది.


Click it and Unblock the Notifications












