India vs England: చెలరేగిన బెయిర్‌స్టో, స్టోక్స్.. రెండో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం!!

పూణే: మూడు మ్యాచుల సిరీసులో భాగంగా పూణే వేదికగా శుక్రవారం టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 43.3 ఓవర్లలలో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) తృటిలో శతకం కోల్పోయాడు. జేసన్ రాయ్ (52 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం చేయగా.. చివర్లో లియామ్ లివింగ్ స్టోన్ (21 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు), డేవిడ్ మలాన్ (23 బంతుల్లో 16; 1 ఫోర్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది. తొలి వన్డేలో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి ఇంగ్లండ్ కసిదీరా బదులు తీర్చుకుంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఆదివారం మూడో వన్డే జరగనుంది.

రఫ్ఫాడించిన రాయ్:
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించింది. క్రీజులో కుదురుకున్నాక విధ్వంసం మొదలైంది. 5 ఓవర్లకు 17 పరుగులు చేసిన ఇంగ్లీష్ ఓపెనర్లు.. ఆపై సిక్సర్ల వర్షం కురిపించారు. మొదటగా జేసన్ రాయ్ బౌండరీలు బాదడం మొదలుపెట్టాడు. ఆపై జానీ బెయిర్‌స్టో జోరుందుకున్నాడు. భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయారు. ఈ క్రమంలో 48 బంతుల్లో రాయ్, 45 బంతుల్లో బెయిర్ స్టో అర్ధ శతకాలు చేశారు. దీంతో ఇంగ్లండ్ 16 ఓవర్లకే 102తో నిలిచింది. అయితే కుల్దీప్ వేసిన 17 ఓవర్లో రాయ్ రనౌట్ కావడంతో తొలి వికెట్‌కు 112కు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

బెయిర్‌స్టో సెంచరీ:
రాయ్ పెవిలియన్ చేరినా.. టీమిండియాకు కష్టాలు తొలగిపోలేదు. బెయిర్‌స్టోకు బెన్ స్టోక్స్ జత కలిశాడు. తొలుత ఆచితూచి ఆడిన స్టోక్స్.. ఆపై రెచ్చిపోయాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. బెయిర్‌స్టో కూడా పరుగుల వరద పారించాడు. ఇద్దరూ రెండో వికెట్‌కు 175 (117 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి ధాటికి ఇంగ్లండ్ 31 ఓవర్లకే 200 పరుగుల మైలురాయి దాటేసింది. బెయిర్‌స్టో దూకుడు కొనసాగిస్తూ.. సిక్సర్ సాయంతో 95 బంతుల్లో శతకం బాదేశాడు.కొద్దిసమయానికే స్టోక్స్ అర్ధ శతకం అందుకున్నాడు.

శివాలెత్తిన స్టోక్స్:
హాఫ్ సెంచరీ అనంతరం స్టోక్స్ శివాలెత్తాడు. కుల్దీప్ వేసిన 33వ ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు.. కృనాల్ వేసిన తర్వాతి ఓవర్లో 6, 4, 2, 6, 6, 2 బాదేశాడు. 40 బంతుల్లో 50 పరుగులు చేసిన స్టోక్స్.. 50 బంతుల్లోనే 95కు చేరుకున్నాడు. దీంతో భారత్ ఓటమి ఖాయం అయింది. ఈ దశలో భువనేశ్వర్ వేసిన 35.2వ బంతికి పంత్‌కు స్టోక్స్ క్యాచ్ ఇచ్చాడు. ప్రసిద్ధ్ వేసిన 37వ ఓవర్లో జానీ బెయిర్‌స్టో, బట్లర్ (0) సైతం ఔటవ్వడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. అయితే డేవిడ్ మలన్ అండతో లియామ్ లివింగ్‌స్టన్ ఇంగ్లండ్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

రాహుల్ సెంచరీ:
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ (114 బంతుల్లో 108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79 బంతుల్లో 66; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా.. రిషభ్ పంత్ (40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 35; 1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఇంగ్లీష్ బౌలర్లలో రీస్ టాప్లీ, టామ్ కరన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
IPL 2021: కత్తిపట్టిన మనీష్ పాండే.. ఇక రచ్చరచ్చే! సన్‌రైజర్స్ అదే కోరుకుంటోంది!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications