India vs England: శతకంతో జోరూట్ జోరు.. టీమిండియా బేజారు!

చెన్నై: అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ఫస్ట్ టెస్ట్‌లో ఇంగ్లండ్ అదరగొట్టింది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్‌పై ఫస్ట్ సెషన్ మినహా.. అంతా పర్యాటక జట్టుదే ఆధిపత్యం కొనసాగింది. 100వ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్(192 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 127 బ్యాటింగ్) సూపర్ సెంచరీతో చెలరేగడం.. ఓపెనర్ డామ్ సిబ్లీ(286 బంతుల్లో 12 ఫోర్లతో 87) బాధ్యాతాయుతమైన బ్యాటింగ్‌తో రాణించడంతో తొలి రోజు ఆటలో పర్యాటక జట్టు పై చేయి సాధించింది.
ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 200 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 89.3 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఆటగాళ్ల జోరును అడ్డుకోవడంలో భారత బౌలర్లు సమష్టిగా విఫలమయ్యారు. అనుభవం లేని ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం భారత జట్టుకు చేటు చేసింది.

బర్న్స్, సిబ్లీ శుభారంభం..
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు రోర్నీ బర్న్స్(33), డామ్ సిబ్లీ శుభారంభాన్ని అందించారు. అయితే బుమ్రా వేసిన ఫస్ట్ బాల్‌కే బర్న్స్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను వికెట్ కీపర్ రిషభ్ పంత్ జారవిడిచాడు. ఈ అవకాశంతో ఆచితూచి ఆడిన రోరీ బర్న్స్, సిబ్లీ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. 2017 తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ తరఫున 50కి పైగా భాగస్వామ్యం అందించిన తొలి ఓపెనింగ్ జోడీగా గుర్తింపుపొందారు. అయితే లంచ్‌కు ముందు ఇంగ్లండ్ రెండు ఓవర్ల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది.

వరుసగా రెండు వికెట్లు..
ప్రమాదకరంగా మారుతున్న ఈ ఓపెనింగ్ జోడీని రవిచంద్రన్ అశ్విన్ విడదీశాడు. 24వ ఓవర్‌లో బర్న్స్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన లారెన్స్(0)ను బుమ్రా వికెట్లు ముందు బోల్తా కొట్టించాడు. ఈ వికెట్‌తో బుమ్రా సొంతగడ్డపై వికెట్ల ఖాతా తెరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జో రూట్.. మరో ఓపెనర్ సిబ్లీతో కలిసి జాగ్రత్తగా ఆడటంతో ఇంగ్లండ్ 67/2తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం రెండో సెషన్‌లో ఈ జోడి భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. చెత్త బంతులను బౌండరీలకు పంపుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలోనే మొదటగా సిబ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. దాంతో ఆ జట్టు 140/2తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

జోరూట్ సెంచరీ..
బ్రేక్ అనంతరం రూట్ కూడా 110 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక హాఫ్ సెంచరీ అనంతరం తన జోరును పెంచిన జోరూట్ భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ప్రతీ ఓవర్‌లో ఓ ఫోర్ కొడుతూ ధాటిగా ఆడాడు. దాంతో మరో 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో 98, 99, 100వ మ్యాచ్‌ల్లో సెంచరీలు అందుకున్న తొలి క్రికెటర్‌గా జోరూట్ చరిత్ర కెక్కాడు. ఇక 100వ మ్యాచ్‌లో సెంచరీ చేసిన 9వ ఆటగాడిగా కూడా ఈ ఇంగ్లండ్ కెప్టెన్ గుర్తింపు పొందాడు. సెంచరీ తర్వాత కూడా జోరూట్ ధాటిగానే ఆడాడు. అశ్విన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా కొట్టిన సిక్స్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక బుమ్రా వేసిన ఆఖరి ఓవర్‌లో సిబ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ రివ్యూకెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ వెంటనే అంపైర్లు తొలి రోజు ఆటను నిలిపేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications