
చెన్నై: భారత్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శ్రీలంక పర్యటనలో కనబర్చిన ఫామ్‌ను ఈ ఇంగ్లండ్ కెప్టెన్ కొనసాగిస్తున్నాడు. 164 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో శతకాన్ని అందుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 78వ ఓవర్ ఆఖరి బంతిని స్క్వేర్ లెగ్‌లోకి ఆడిన రూట్.. క్విక్ సింగిల్‌తో సెంచరీ మార్క్ అందుకున్నాడు.
కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడుతున్నజోరూట్‌కు ఇది 20వ సెంచరీ. తొలుత హాఫ్ సెంచరీకి 110 బంతులు తీసుకున్న జోరూట్ అనంతరం ధాటిగా ఆడి మరో 54 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. దాంతో 98, 99, 100వ మ్యాచ్‌ల్లో సెంచరీలు అందుకున్న తొలి క్రికెటర్‌గా జోరూట్ చరిత్ర కెక్కాడు. ఇక 100వ మ్యాచ్‌లో సెంచరీ చేసిన 9వ ఆటగాడిగా కూడా ఈ ఇంగ్లండ్ కెప్టెన్ గుర్తింపు పొందాడు.
కొలిన్ కౌడ్రే(ఇంగ్లండ్), జావెద్ మియాందాద్(పాకిస్థాన్), గోర్డాన్ గ్రీనిడ్జ్(వెస్టిండీస్), అలెక్ స్టెవార్ట్(ఇంగ్లండ్), ఇంజమామ్ ఉల్ హక్(పాకిస్థాన్), రికీపాంటింగ్(ఆస్ట్రేలియా), గ్రేమ్ స్మిత్(సౌతాఫ్రికా), హషిమ్ అమ్లా(సౌతాఫ్రికా) జోరూట్ కన్నా ముందు 100వ మ్యాచ్‌లో సెంచరీ చేశారు. ఇందులో పాంటింగ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు అందుకున్నాడు.
ఇక భారత్‌పై జోరూట్‌కు ఇది 5వ సెంచరీ. ఇక శ్రీలంక పర్యటనలో ఓ ద్విశతకం, మరో భారీ సెంచరీతో జోరూట్ సత్తా చాటిన విషయం తెలిసిందే. మరోవైపు ఓపెనర్ సిబ్లీ(83) కూడా సెంచరీ దిశగా పయనిస్తుండటంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. వీరిద్దరి నిలకడైన ఆటకు 80 ఓవర్లలో ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.