
అహ్మదాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20లో భారత్ 8 పరుగులతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న విషయం తెలిసిందే. యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే సెకండ్ టీ20తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సూర్య.. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌లతో బ్యాటింగ్ చేయలేకపోయాడు. మూడో టీ20లో రోహిత్ శర్మ రాకతో అవకాశం కోల్పోయాడు. ఇక నాలుగో టీ20కి ముందు ఇషాన్ కిషన్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన సూర్య.. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
అయితే సూర్యకుమార్ యాదవ్ కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫేవరెట్ మూడో స్థానాన్ని త్యాగం చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (12) ఆరంభంలోనే ఔటవ్వగా.. విరాట్ కోహ్లీ క్రీజులోకి వస్తాడని అంతా ఊహించారు. కానీ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా బరిలోకి దిగాడు. మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్‌గా మలిచిన సూర్యకుమార్ యాదవ్ మెరుపు హాఫ్ సెంచరీ బాదేశాడు. అయితే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ (1) ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్ కోసం స్టెప్ ఔటై స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఇక సూర్య కోసం విరాట్ కోహ్లీ త్యాగం చేయడం అద్భుతమని ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించాడు.
'విరాట్ కోహ్లీని లీడర్‌గా నేను గౌరవించడానికి కారణం ఇదే. కొత్తగా భారత్ జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇవ్వడం కోసం తన ఫేవరెట్ బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు'అని ఈ భారత మాజీ ఆల్‌రౌండర్ ట్వీట్ చేశాడు. ఇక నెటిజన్లు కూడా కోహ్లీ త్యాగంపై ప్రశంసల జల్లు కురిపించారు.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. సూర్య సూపర్ ఫిఫ్టీతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఆర్చర్‌కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (23 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జేసన్ రాయ్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా ఫలితం లేకపోయింది.