ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ!
పుణె: టెస్ట్, టీ20 సిరీస్‌లను ఓటమితో మొదలుపెట్టిన టీమిండియా.. వన్డే వార్‌ను మాత్రం అద్భుత విజయంతో షురూ చేసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో చెలరేగి ఆడుతూ ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఎంసీఏ స్టేడియం వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేలో భారత్ 66 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అయితే ఈ ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, సామ బిల్లింగ్స్ రెండో వన్డే ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.

ఫీల్డింగ్ చేస్తూ..
భారత్ ఇన్నింగ్స్ సందర్బంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ఇయాన్ మోర్గాన్.. వెంటనే మైదానం వీడాడు. మోర్గాన్ బొటన, చూపుడు వేళ్ల మధ్యలో కుట్లు వేయాల్సి వచ్చింది. ఇక నొప్పితో ఇబ్బంది పడుతూనే మోర్గాన్ బ్యాటింగ్ కొనసాగించాడు. 22 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇక బౌండరీ ఆపే క్రమంలో సామ్ బిల్లింగ్స్ భుజానికి గాయమైంది. అతని ఎడమ భుజం డిస్ లొకేట్ కావడంతో అతను కూడా మైదానం వీడాడు. బ్యాటింగ్‌కు దిగినా ఇబ్బంది పడుతూనే ఆటను కొనసాగించాడు. 18 పరుగులు చేసి అరంగేట్ర బౌలర్ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

48 గంటలు గడిస్తే కానీ..
దాంతో ఈ ఇద్దరు తదుపరి మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. దానికి తోడు 48 గంటలు గడిస్తే గాని గాయాల తీవ్రత గురించి చెప్పలేనని మ్యాచ్ అనంతరం మోర్గాన్ చెప్పాడు. అయితే శుక్రవారం జరిగే మ్యాచ్‌లోపు తాము కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఇక సామ్ బ్యాటింగ్‌కు దిగడం గురించి తనకు తెలియదన్నాడు. ఓటమిపై స్పందిస్తూ.. మంచి ఆరంభాన్ని అందిపుచ్చుకోలేకపోయామన్నాడు. 'మేం ప్రమాదకర జట్టని నేను భావిస్తాను. అయితే భారత్‌తో తొలి వన్డేలో ఓటమిపై మాత్రం మా వాళ్లను తప్పుపట్టట్లేదు. టీమ్ఇండియా బాగా బౌలింగ్ చేసింది. మేం చిన్న చిన్న తప్పులు చేశాం కానీ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం'అని మోర్గాన్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ , అయ్యర్‌లకు గాయాలు
తొలి వన్డేలో ఇద్దరు భారత ఆటగాళ్లు కూడా గాయపడ్డారు. వుడ్ వేసిన బంతి రోహిత్ కుడి మోచేతికి బలంగా తాకింది. నొప్పికి రెండుసార్లు మైదానంలోనే చికిత్స చేయించుకొని ఆట కొనసాగించిన అతను ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. ఇక ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని ఆపే క్రమంలో శ్రేయస్ అయ్యర్ భుజానికి బలంగా దెబ్బ తగిలింది. వెంటనే మైదానం వీడిన అతడిని స్కానింగ్ కోసం పంపించారు. గాయం తీవ్రత దృష్ట్యా అయ్యర్ తదుపరి మ్యాచ్‌ల్లో బరిలోకి దిగేది అనుమానమే.

గర్జించిన గబ్బర్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శిఖర్ ధావన్ (106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98) సెంచరీ చేజార్చుకోగా... కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 నాటౌట్), కృనాల్ పాండ్యా (31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 నాటౌట్), కోహ్లీ (60 బంతుల్లో 6 ఫోర్లతో 56) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (66 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 94) టాప్ స్కోరర్ కాగా, జేసన్ రాయ్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) రాణించాడు. ప్రసిధ్ కృష్ణకు 4, శార్దుల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే శుక్రవారం ఇదే వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications