
రూల్స్ మార్చండి..
'పిచ్‌ల గురించి ఎందుకింత చర్చో అర్థం కావట్లేదు. చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలంగా భారత్‌లో పిచ్‌ల స్వభావం ఇంతే. వీటిలో మార్పు రావాలని అనుకోవట్లేదు. స్థానిక పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి జట్టు కోరుకుంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు మా గురించి ఎవరూ ఆలోచించరు. అలాంటప్పుడు ఇతర జట్ల గురించి మేమెందుకు ఆలోచించాలి? జట్టు ప్రాధాన్యత ప్రకారం నడుచుకోవాలి. సొంతగడ్డపై సానుకూలత అంటే అదే. లేదంటే పూర్తిగా మార్చేయండి. ఎక్కడైనా పిచ్‌లన్నీ ఒకేలా ఉండేలా ఐసీసీ నిబంధనలు రూపొందించాలి.

ఇది అనవసర చర్చ..
మేం విదేశాలకు వెళ్లినప్పుడు ప్రజల వ్యవహార శైలి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. పిచ్‌ల గురించి అసలు చర్చే అవసరం లేదన్నది నా అభిప్రాయం. ఆటగాళ్లు, వారి ప్రదర్శనలపై చర్చలు జరగాలి. బ్యాటింగ్, బౌలింగ్ ఎలా చేశారని మాట్లాడాలే గాని పిచ్‌ల గురించి కాదు. రెండు జట్లు ఒకే పిచ్‌పై ఆడతాయి. మెరుగ్గా ఆడిన జట్టే గెలుస్తుంది. మేమైతే పిచ్ గురించి ఎప్పుడూ ఆలోచించం. ఎక్కువ ఆలోచించినంత మాత్రాన పిచ్ ఏమీ మారదు. మొతేరా పిచ్‌లో మార్పేమి కనిపించట్లేదు. రెండో టెస్టులో మాదిరే ఉండొచ్చు. బంతి తిరగొచ్చు. అందుకు తగ్గట్లుగానే సన్నద్ధమవుతున్నాం.

ఒకే మ్యాచ్ ఆడా..
నేనిప్పటిదాకా ఒకే ఒక్క పింక్ బాల్ టెస్ట్.. బంగ్లాదేశ్‌తో ఆడా. అందులో నాకు సూర్యాస్తమయ సమయంలో బ్యాటింగ్ చేసే చాన్స్ రాలేదు. కానీ ఆ సమయంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయనే దానిని పరిశీలించా. వాతావరణం, వెలుతురు మారే సమయం కావడం వల్ల ఆ సమయంలో సవాల్ తప్పదు. అందు వల్ల మరింత ఫోకస్‌గా, జాగ్రత్తగా ఆడాలి. మనల్ని మనం సిద్దం చేసుకోవాలి. బ్యాట్స్‌మెన్స్ అందరికీ ఈ చాలెంజ్ గురించి తెలుసు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చెయ్యాల్సిందే. కొత్త స్టేడియంలో ఎప్పుడు ఆడినా సరే ఫ్లడ్‌లైట్స్‌తో ఇబ్బంది ఉంటుంది.

మా మధ్య మంచి కమ్యూనికేషన్
సోమవారం మేము లైట్స్ కింద ప్రాక్టీస్ చేయనున్నాం. కొత్తవి కావడం వల్ల స్టాండ్స్‌లో సీట్లు లైటింగ్ వల్ల మెరుస్తుంటాయి. ప్రాక్టీస్ సెషన్‌లో వీటిపై దృష్టి పెట్టి పరిస్థితులను అలవాటు చేసుకుంటాం. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలని మాకు ఉంది. కానీ దానికి చాలా దూరం ఉంది. అక్కడి దాకా వెళ్లాలంటే ముందు చాలా చెయ్యాలి. అందుకే మేము ప్రజెంట్ మూమెంట్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటాం.
నేను స్లిప్స్‌లో ఎక్కువగా ఫీల్డింగ్ చేస్తుంటా. ఆ ప్లేస్ నుంచి బ్యాట్స్‌మన్ ఎలా ఆడుతున్నాడో, అతని ప్లాన్ ఏంటో అర్థం చేసుకుని టీమ్‌మేట్స్‌కు చెబుతా. మిగిలిన వాళ్లు కూడా అలానే చేస్తుంటారు. మా మధ్య ఈ కమ్యూనికేషన్ ఉండటం వల్లే చాలా సందర్భాల్లో ఊహకందని విధంగా మ్యాచ్‌ల్లో పుంజుకుని విజయాలు సాధించాం'అని రోహిత్ చెప్పాడు.


Click it and Unblock the Notifications
