
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ వివాదాస్పద రీతిలో పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. అతని ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వివాదాస్పద నిర్ణయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ అత్యంత చెత్త నిర్ణయంగా అభివర్ణించాడు. ప్రతీ బౌలర్ ఔట్ అనే అనుకుంటాడు. కానీ అంపైర్‌ది అత్యంత చెత్త నిర్ణయం'అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కు బదులిచ్చిన ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. సాఫ్ట్ సిగ్నల్ నిబంధనే బాలేదన్నాడు. 'సాఫ్ట్ సిగ్నల్ అనే నిబంధన అస్సలు బాలేదు. ఇలాంటి సందర్భాల్లో ఆఫ్ ఫీల్డ్ అంపైర్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడం కష్టమే. 'నాకు తెలియదు కానీ గెస్ చేయగలను. కాబట్టి ఇది అవుట్'అని సాఫ్ట్ సిగ్నల్ ఇవ్వడం ఏంటో'అని బ్రాడ్ ఈ రూల్‌ను విమర్శించాడు. అదే సమయంలో డేవిడ్ మలన్‌కు మద్దతుగా నిలిచాడు. బాల్ చేజారుతుందని అతనికి తెలియదన్న బ్రాడ్.. మలన్ గురించి ట్విటర్‌లో వస్తున్న కామెంట్లు చాలా దారుణంగా ఉన్నాయని తెలిపాడు.
ఇక సామ్ కరన్ వేసిన 14 ఓవర్ తొలి బంతిని తనదైన రివర్స్ స్వీప్ షాట్‌తో భారీ సిక్సర్ కొట్టిన సూర్య.. ఆ మరుసటి బంతిని కూడా అదే రీతిలో నటరాజ్ షాట్ ఆడాడు. అయితే బంతి ఫైన్ లెగ్‌లో ఉన్న డేవిడ్ మలన్ చేతిలో పడింది. కానీ అతను క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి నేలకు తాకినట్లు స్పష్టమైన ఆధారం లేదని, నిబంధనల మేరకు తాను ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సాప్ట్ సిగ్నల్‌కు కట్టుబడి ఔటిస్తున్నానని తెలిపాడు. అయితే బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనబడుతున్నా అంపైర్ ఆధారం లేదనడం వివాదాస్పదమైంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 పరుగులతో విజయం సాధించి సిరీస్ రేసులో నిలిచిన విషయం తెలిసిందే. సిరీస్ డిసైడర్, ఆఖరి టీ20 శనివారం అహ్మదాబాద్ వేదికగానే జరగనుంది.