
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న డై/నైట్ టెస్ట్‌లో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కలిసేందుకు బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించాడు. తొలి రోజు ఆటలో భారత ఇన్నింగ్స్ సందర్భంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా సదరు అభిమాని సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి పరుగు తీశాడు. ఇది గమనించిన కోహ్లీ.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పక్కకు జరిగి.. అభిమానిని దూరం నుంచే పంపించేశాడు.
ఈ ఘటనతో అప్రమత్తమైన మైదాన సిబ్బంది సదరు అభిమానిని బయటకు తీసుకెళ్లారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయోబబుల్ ప్రోటోకాల్స్‌లో భాగంగా క్రికెటర్లు, అధికారులు ఎవరినీ కలవడానికి లేదు. ప్రాక్టీస్ సెషన్లలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కేవలం 50శాతం మంది మాత్రమే ప్రేక్షకులను అనుమతించారు.
ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. అహ్మదాబాద్ మొతెరాలో రీకన్‌స్ట్రక్ట్ చేసిన సర్దార్ పటేల్ స్టేడియాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్చారు. మైదాన ప్రారంభోత్సవం కావడంతో అభిమానులు పోటెత్తారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రధాన బౌలర్ కాకపోయినా... అక్షర్ పటేల్ (6/38) ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పాలిట ప్రమాదకర బౌలరయ్యాడు. దీంతో బుధవారం మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లయినా ఆడలేకపోయింది. 48.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ (53; 10 ఫోర్లు) ఒక్కడే భారత్ బౌలర్లను ఎదుర్కొన్నాడు.
మరో స్పిన్నర్ అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. 100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్‌కు ఒక వికెట్ లభించింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట నిలిచే సమయానికి 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (82 బంతుల్లో 57 బ్యాటింగ్; 9 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 2 వికెట్లు తీశాడు.