ఐపీఎల్ ముందు ఇంగ్లండ్ క్రికెటర్లకు మోర్గాన్ కీలక సూచన!

అహ్మదాబాద్: భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం సన్నద్దమయ్యేందుకు వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఆ జట్టు పరిమత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సూచించాడు. శనివారం భారత్‌తో జరిగిన ఆఖరి టీ20లో 36 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్.. 2-3తో సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మోర్గాన్.. ఐపీఎల్ ఆడే ఆటగాళ్లు ఇక్కడి పరిస్థితులను అలవర్చుకోవాలన్నాడు.

ఐపీఎల్‌ను వాడుకోవాలి..
'రాబోయే ఐపీఎల్ సీజన్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఆటగాళ్లకు ఉపకరిస్తుంది. ఈ టీ20 లీగ్‌లో ఏ అవకాశం వచ్చినా ఆటగాళ్లు రెండు చేతులతో ఒడిసిపట్టుకోవాలి. వాటిని పూర్తిగా అందిపుచ్చుకోవాలి. ఐపీఎల్ తర్వాత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మేం స్వదేశంలో న్యూజిలాండ్, భారత్‌తో రెండు టెస్టు సిరీస్‌లు ఆడనున్నాం. ఆపై బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ కోసం అత్యుత్తమ పదకొండు మందిని ఎంపిక చేయడానికి ఆయా పర్యటనలు సరిపోవు.

ఎవరు బాగా ఆడితే వారికే..
కాబట్టి.. రాబోయే రెండు, మూడు నెలల్లో ఇక్కడ లభించే అనుభవం ఎంతో విలువైనది. తర్వాత మా నైపుణ్యాలపై శ్రద్ధ పెట్టడానికి తగిన సమయం ఉంటుంది' అని ఈ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ విశ్లేషించాడు. అలాగే ఇటీవల సౌతాఫ్రికా, టీమిండియాతో ఆడిన టీ20ల్లో ఇంగ్లాండ్ అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లను ఆడించింది. దీంతో రాబోయే సిరీస్‌ల్లో అలా జరగదని, కేవలం పొట్టి ఫార్మాట్ ఆటగాళ్లతోనే ఆడతామని సూచనప్రాయంగా తెలిపాడు. ఇక ప్రపంచకప్ జట్టులో ఎవరుంటారు, ఎవరు ఉండరనే విషయాలు ఇప్పుడే చెప్పలేమని, రాబోయే రోజుల్లో ఎవరు బాగా ఆడితే వారికి అవకాశాలు లభిస్తాయన్నాడు.

బాగానే రాణించాం..
ఇక ఆఖరి టీ20 ఓటమిపై స్పందిస్తూ.. అత్యంత బలమైన జట్టుతో వాళ్ల హోమ్ గ్రౌండ్‌లోనే తలపడటం అంటే చాలా కష్టమేనన్నాడు. కానీ తాము ఈ సిరీస్‌లో మంచి ప్రతిభ కనభరిచామనే అనుకుంటున్నామని తెలిపాడు. 'టీ20 సిరీస్‌లో బాగానే రాణించాము. 4వ టీ20లో దాదాపు భారత్‌ను ఓడించినంత పనిచేశాము. కానీ కీలకమైన సమయంలో భారత్ పుంజుకున్నది. ఈ రోజు మాకు సరిగ్గా కలిసి రాలేదు. మంచి ఆరంభమే దొరికినా.. దాన్ని కొనసాగించడంలో విఫలమయ్యాము. టీ20లో ఆదిల్ రషీద్ టాలెంట్ ఏమిటో మాకు తెలిసింది. గెలిచిన జట్టుకు నా శుభాకాంక్షలు. రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఈ సిరీస్ మాకు చాలా ఉపయోగపడుతుంది.'అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications