PinkBall Test: సొంత మైదానంలో తిప్పేసిన అక్షర్ పటేల్.. 112 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!!

అహ్మదాబాద్: గుజరాత్‌లోని నరేంద్ర మోదీ (మొతేరా) స్టేడియంలో జరుగుతున్న డేనైట్ టెస్టులో భారత స్పిన్నర్లు చెలరేగారు. కొత్త స్టేడియంలో అక్షర్ పటేల్ (6/38), రవిచంద్రన్ అశ్విన్ (3/26) గులాబీ బంతితో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ను వణికించారు. ముఖ్యంగా అక్షర్ సొంత మైదానంలో బెబ్బులిలా రెచ్చిపోయాడు. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. బంతి గింగిరాలు తిరిగే పిచ్‌పై మన బౌలర్లు రెండు సెషన్లలోనే ప్రత్యర్థి ఆట కట్టించారు. దీంతో ఇంగ్లండ్ 112 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ జాక్ క్రాలీ (53; 84 బంతుల్లో 10×4) టాప్ స్కోరర్. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ (1/26) ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నాడు.

ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాక్:
టాస్ నెగ్గి బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ డొమినిక్ సిబ్లే ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవరలో సిబ్లే ఔటయ్యాడు. ఆ ఓవర్ మూడో బంతికి రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. అక్షర్ పటేల్ వేసిన 6వ ఓవర్ మొదటి బంతి జానీ బెయిర్ స్టో ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. టీమిండియా ఎల్బీ అప్పీల్ చేయడంతో అంపైర్ నితిన్ మీనన్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బెయిర్ స్టో రివ్యూకి వెళ్లగా.. రిప్లేలో బంతి ఇంపాక్ట్ మిడిల్ స్టంప్‌పైకి వెళుతున్నట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు.

ఆదుకున్న క్రాలీ:
ఆపై క్రాలీ, రూట్ ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్న క్రాలీ బౌండరీల మోత మోగించాడు. దీంతో ఇంగ్లీష్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో అక్షర్ బౌలింగ్‌లో బౌండరీ బాది 67 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అతడి కెరీర్‌లో ఇది నాలుగో ఫిఫ్టీ. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని స్పిన్నర్ ఆర్ అశ్విన్ విడదీశాడు. రూట్ (17) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. ఆపై క్రాలీ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్ 81/4తో ఇబ్బందుల్లో పడింది.

మరింత రెచ్చిపోయారు:
టీ విరామం తర్వాత భారత స్పిన్నర్లు మరింత రెచ్చిపోయారు. బెన్ స్టోక్స్ (6), బెన్ ఫోక్స్ (12), ఓలీ పోప్ (1) అతి కష్టంగా పరుగుల ఖాతా తెరిచినా.. ఎక్కువసేపు క్రీజులో మాత్రం నిలవలేకపోయారు. అశ్విన్, అక్షర్‌లతో సుదీర్ఘ స్పెల్ వేయించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లీష్ టీమ్ పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. చివర్లో జోప్రా ఆర్చర్ (11), జాక్ లీచ్ (3), స్టువర్ట్ బ్రాడ్ (3), జేమ్స్ అండర్సన్ (0) కూడా చేతులెత్తేయడంతో ఇంగ్లండ్ 112 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అక్షర్ 6 వికెట్లు తిస్తే.. అశ్విన్ 3, ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ అవసరమే లేకుండా పోయింది.

బ్యాటింగ్ ఆరంభించిన భారత్:
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ అనంతరం భారత్ బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడుతున్నారు. ఇంగ్లీష్ సీనియర్ పేస్ జోడి జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ చేస్తున్నారు. రోహిత్ బౌండరీ బాదాడు. భారత్ 4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 5 పరుగులు చేసింది. రోహిత్ (5), గిల్ (0) పరుగులతో ఉన్నారు.
India vs England: నరేంద్ర మోదీ స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్ సూపర్.. చూస్తే షాకే (వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications