
మాంచెస్టర్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ రద్దయింది. భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో అవకాశం ఉంటే ఈ మ్యాచ్ నిర్వహిస్తామని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఓ ప్రకటనలో పేర్కొంది.
'బీసీసీఐతో సంప్రదింపులు జరిపిన తర్వాత భారత్-ఇంగ్లండ్ మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగాల్సిన ఆఖరి టెస్ట్‌ను రద్దు చేస్తున్నాం. భారత క్యాంప్‌లో మరిన్ని కరోనా కేసులు వెలుగు చూసే అవకాశం ఉండటంతో చివరి టెస్ట్ ఆడేందుకు కోహ్లీసేన విముఖత వ్యక్తం చేసింది. ఈ అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్ రద్దవ్వడం పట్ల అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తాం'అని ఈసీబీ తమ ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
అయితే ముందుగా విడుదల చేసిన ప్రకటనలో భారత్ వాకోవర్ తీసుకుందని సిరీస్ 2-2తో సమమైందని ఈసీబీ పేర్కొంది. నిమిషాల వ్యవధిలోనే ఈసీబీ ప్రకటనను మార్చడంతో గందరగోళం నెలకొంది. ఇక టీమిండియా ఫిజియో నితిన్ పటేల్‌కు పాజిటివ్ రావడంతో అతని బాధ్యతలు అసిస్టెంట్ ఫిజియో యోగేష్ పర్మార్‌కు అప్పగించారు. అయితే ఐదు టెస్ట్ ముంగిట పర్మార్ కూడా పాజిటివ్‌గా నిర్దారించబడ్డాడు. అతనికి రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజార, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ సన్నిహితంగా ఉన్నారు. దాంతో ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దయింది. అప్పుడే ఐదో టెస్టు జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా మ్యాచ్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. మ్యాచ్ జరిగే అవకాశం చాలా తక్కువ అంటూ వెల్లడించారు.
ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ నేపథ్యంలోనే ఆఖరి మ్యాచ్‌ను రద్దు చేసిన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆటగాళ్లు సెప్టెంబర్ 15న ప్రత్యేక విమానంలో దుబాయ్ పయనం కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు అక్కడ ప్రాక్టీస్ క్యాంప్‌లు మొదలుపెట్టాయి.
అయితే ఐదో టెస్టు జరిగే సమయంలో ఏ ఆటగాడికైనా కరోనా పాజిటివ్‌గా తేలితే కనీసం 10 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి. ఇదే జరిగితే ఐపీఎల్ నిర్వహణపై ప్రభావం పడుతుంది. అందుకే ముందుగానే ఈ పరిస్థితిని గమనించిన బీసీసీఐ.. మ్యాచ్‌ను వదులుకోవడమే మంచిదని భావించినట్లు తెలుస్తోంది.