India vs England: కోహ్లీ కెప్టెన్సీకి అగ్ని పరీక్ష.. జట్టులోకి అక్షర్ పటేల్, కుల్దీప్‌కు మళ్లీ నిరాశే!

చెన్నై: సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో ఊహించని పరాజయంతో నేలకు దిగిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగానే శనివారం నుంచి జరిగే సెకండ్ టెస్ట్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫస్ట్ టెస్ట్ పరాజయంతో ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానానికి పడిపోయిన భారత్ విజయంతో ఫైనల్ బెర్త్ ఆశలను సజీవం చేసుకోవాలనుకుంటుంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా తమ జైత్రయాత్రను కొనసాగించి రిస్క్ లేకుండా చాంపియషిప్ ఫైనల్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. ఇంగ్లండ్ విజయ ఉత్సాహంలో ఉంటే.. ఓటమితో దెబ్బతిన్న భారత్ ప్రతీకారం తీర్చుకొని సిరీస్ రేసులో నిలవాలనుకుంటుంది. దాంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ సామర్థ్యానికి పరీక్షగా మారిన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో భారత్ బరిలోకి దిగుతోంది. పైగా ఈ మ్యాచ్‌కు 50 శాతం మంది అభిమానులను అనుమతిస్తుండటం ఆతిథ్య జట్టుకు కలిసొచ్చే అంశం. ఏడాది తర్వాత భారత్‌లో మళ్లీ ఫ్యాన్స్ సమక్షంలో జరుగుతున్న మ్యాచ్ ఇదే కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా గతేడాది జనవరిలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించారు.

ఫైనల్ ఎలెవన్ ఎలా..?
కుర్రాళ్లతో కూడిన జట్టు ఆసీస్ పర్యటనలో అద్భుత విజయంతో చరిత్ర సృష్టిస్తే.. సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టు ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. ఫస్ట్ టెస్ట్‌కు ఎంపిక చేసిన తుది జట్టుపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకోకపోవడం మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు. అయితే అతన్ని తీసుకోకపోవడానికి గల కారణాన్ని విరాట్ వివరించాడు. పేపర్‌పై జట్టు బలంగా కనిపిస్తున్నా.. సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం టీమ్‌ను వెంటాడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, పుజారా మంచి టచ్‌లోనే ఉన్నారు. బ్యాటింగ్ పరంగా పంత్ రాణిస్తున్నా కీపర్‌గా దారుణంగా విఫలమవుతున్నాడు. అయితే ఇప్పటికిప్పుడు అతని చోటుకు వచ్చే డోకా ఏం లేదు. రోహిత్, రహానేలపై వేటు వేసే ధైర్యం కూడా చేయకపోవచ్చు.

ముగ్గురు స్పిన్నర్లా..?
ఫస్ట్ టెస్ట్‌లో ముగ్గురు స్పిన్నర్లు వ్యూహం బెడిసి కొట్టడంతో అదే కొనసాగిస్తారా? లేక మరో పేసర్ తీసుకుంటారా? అనేది ఆసక్తికరం. షెబాజ్ నదీం స్థానంలో అక్షర్ పటేల్ రావడం ఖాయామైంది. బౌలింగ్‌లో విఫలమైనా బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో సుంధర్ చోటుకు లోటు లేదు. కానీ అదనపు పేసర్ కావాలనుకుంటే మాత్రం అతని స్థానంలో హార్దిక్ పాండ్యా లేదా శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవచ్చు. అయితే సెకండ్ టెస్ట్ కోసం పూర్తిగా టర్న్ పిచ్‌ను సిద్దం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగవచ్చు.

సిరాజ్‌కు చోటు దక్కెనా..?
అశ్విన్ ఎలాగూ స్పిన్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. దాంతో కుల్దీప్‌కు మరోసారి నిరాశే ఎదురుకానుంది. పేస్ బౌలింగ్‌కు వస్తే బుమ్రా అటోమెటిక్ సెలెక్షన్. సెకండ్ పేసర్‌గా ఫస్ట్ టెస్ట్‌కు ఇషాంత్ శర్మను తీసుకున్నా అతను ఆశించిన స్థాయిలో రాణించలేదు. వాస్తవానికి ఈ ఇద్దరూ పేసర్లు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లలా రాణించడంలో సమష్టిగా విఫలమయ్యారు. అయితే ఇషాంత్ మరో అవకాశం ఇస్తారా? లేక సిరాజ్‌ను తీసుకుంటారా? అనేది చూడాలి. పాత బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టే సామర్థ్యం సిరాజ్‌కు ఉందని అతన్నే తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి టీమ్‌మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో చూడాలి.

జోరూట్ జోరుగా..
శ్రీలంక ఫామ్‌నే కొనసాగించిన జోరూట్ డబుల్ సెంచరీతో భారత్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా బెన్ స్టోక్స్, రోరీ బర్న్స్ రాణించారు. బౌలింగ్‌లో అండర్సన్, ఆర్చర్, డామ్ బెస్, జాక్ లీచ్ అదరగొట్టారు. అయితే ఆర్చర్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరంగా కాగా స్టువర్ట్ బ్రాడ్ జట్టులోకి వచ్చాడు. రొటేషన్ పాలసీలో భాగంగా జోస్ బట్లర్ స్వదేశానికి వెళ్లగా.. అండర్సన్‌కు విశ్రాంతినిచ్చారు. బట్లర్ ప్లేస్‌లో బెన్ ఫోక్స్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనుండగా.. అండర్సన్ స్థానంలో క్రిస్ వోక్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఆశ్చర్యకరంగా ఫస్ట్ టెస్ట్‌లో రాణించిన డామ్ బెస్‌ను కూడా ఇంగ్లండ్ టీమ్ తప్పించింది. అతని స్థానంలో మోయిన్ అలీని తీసుకొచ్చింది. ఇప్పటికే 12 మంది సభ్యులతో కూడిన జట్టు ప్రకటించింది. మ్యాచ్ ముందు తుది జట్టును వెళ్లడించనుంది.

తుది జట్లు అంచనా..
భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ/మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్: జోరూట్(కెప్టెన్), మోయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, బెన్ ఫోక్స్(కీపర్), డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఒలి పోప్, డామ్ సిబ్లీ, బెన్ స్టోక్స్, ఒలీ స్టోన్/ క్రిస్ వోక్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications