ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు తేలిపోయారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ(2/38), అక్షర్ పటేల్(2/32) స్పిన్ మాయాజాలంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది.
మరోసారి కెప్టెన్ జోస్ బట్లర్(30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్స్(17 బంతుల్లో ఫోర్లు, 3 సిక్స్‌లతో 31) విలువైన పరుగులు చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీగాయ.. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలకు తలో వికెట్ దక్కింది.

మరోసారి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. స్టార్ ఓపెన్ ఫిల్ సాల్ట్(4)ను అర్ష్‌దీప్ సింగ్ మరోసారి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ బెన్ డక్కెట్(3)ను సుందర్ ఔట్ చేయగా.. హ్యారీ బ్రూక్‌తో కలిసి బట్లర్ దూకుడుగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో ఇంగ్లండ్ 2 వికెట్లకు 58 పరుగులు చేసింది.
పవర్ ప్లే ముగిసిన వెంటనే కెప్టెన్ సూర్య.. వరుణ్ చక్రవర్తీని బరిలోకి దించగా.. అతను స్టన్నింగ్ డెలివరీతో హ్యారీ బ్రూక్(13)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగిన జోస్ బట్లర్ జోరుకు అక్షర్ పటేల్ కళ్లెం వేసాడు. వరుస ఓవర్లలో జోస్ బట్లర్‌తో పాటు లియామ్ లివింగ్ స్టోన్(13)ను పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్‌లో జామీ ఓవర్టన్‌ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. బ్రైడన్ కార్స్ దూకుడు ఆడాడు. అయితే అతను రనౌటవ్వడంతో ఇంగ్లండ్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.