యువ ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఓ లెస్సెన్: వీవీఎస్ లక్ష్మణ్

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. వికెట్లు పడుతున్నా పరుగులు ఎలా చేయాలో విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని యువ ఆటగాళ్లకు సూచించాడు. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20లో విరాట్ కోహ్లీ(77 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్ ఈ తరం ఆటగాళ్లకు ఓ లెస్సన్ లాంటిదని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైనప్పటికీ.. కోహ్లీ పోరాటం ఆకట్టుకుంది. తొలి 29 బంతుల్లో 28 పరుగులు చేసిన కోహ్లీ.. తర్వాత విధ్వంసకర ఆటతీరుతో 17 బంతుల్లోనే 49 పరుగులు నమోదు చేశాడు.

సూపర్భ్ ఇన్నింగ్స్..
ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ షోలో కోహ్లీ ఇన్నింగ్స్‌పై మాట్లాడిన వీవీఎస్.. భారత్ కెప్టెన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. 'ఒకానొక దశలో టీమిండియా కనీసం 140 పరుగులైనా చేస్తుందా? అనే సందేహం కలిగింది. ఎందుకంటే మొదట్లోనే ఎక్కువ వికెట్లు పడ్డాయి. కానీ విరాట్ కోహ్లీ విజృంభించాడు.
చేజింగ్ కింగ్ సెకండ్ టీ20లోనే తన మాయాజాలం ప్రదర్శించినా మూడో టీ20లో ఇన్నింగ్స్ మాత్రం అద్భుతం. తొలుత ఒత్తిడిని అధిగమించాడు. ఆ తర్వాత భాగస్వామ్యాలు నిర్మించాడు. తర్వాత దూకుడుగా ఆడాడు. ఒత్తిడిలో బ్యాటింగ్ ఎలా చేయాలో? పరుగులు ఎలా సాధించాలో? విరాట్ కోహ్లీ చూసి యువ ఆటగాళ్లు నేర్చుకోవాలి' అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

ఎంజాయ్ చేశా..
'విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చినప్పుడు 3 వికెట్లు పడ్డాయి. భాగస్వామ్యాల అవసరం ఏర్పడింది. తొలుత రిషభ్ పంత్, తర్వాత హార్దిక్ పాండ్యతో భాగస్వామ్యాలు నిర్మించాడు. అతను క్రీజును ఉపయోగించుకొన్న విధానం నాకెంతో నచ్చింది. ఫీల్డర్ల మధ్య గ్యాప్‌లు ఎక్కడున్నాయో అతనికి బాగా తెలుసు. అందుకే అక్కడే షాట్లు ఆడాడు.
కేవలం ఫోర్లే కాదు సిక్సర్ల వర్షం కురిపించాడు. పరిస్థితులను బాగా అర్థం చేసుకున్న కోహ్లీ అనవసర షాట్ల జోలిక పోలేదు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ బౌండరీలు, సిక్సర్లను మైదానం మొత్తం బాదేశాడు. చివర్లో మార్క్‌వుడ్, ఆర్చర్, జోర్డాన్ బౌలింగ్‌లో దూకుడు కొనసాగించాడు. విరాట్ బ్యాటింగ్‌ను నేను ఎంతగానో ఎంజాయ్ చేసా'అని లక్ష్మణ్ తెలిపారు.

బట్లర్ బాదేశాడు..
మూడో టీ20లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ (46 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాట్స్‌మెన్ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది.
'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' బట్లర్ (52 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించగా... బెయిర్‌స్టో (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. నాలుగో మ్యాచ్ ఇదే వేదికగా గురువారం జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications