బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత్‌లో ఆగ్రహ జ్వాలాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ తరహాలోనే బంగ్లాదేశ్‌తోనూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. భారత పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్టు సెప్టెంబర్‌లో ఈ పర్యటన ఉంటుందని తెలిపింది.
వాస్తవానికి గతేడాదే భారత్.. బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ ఆ దేశంలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్‌ను బీసీబీ వాయిదా వేసింది. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వ కూలిన తర్వాత బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దాంతో గతేడాది ఆగస్టులో జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌లు వాయిదా పడ్డాయి.

తాజా షెడ్యూల్ ప్రకారం భారత జట్టు ఆగస్టు 28న బంగ్లాదేశ్ చేరుకుంటుంది. ఈ పర్యటనలో బంగ్లాదేశ్‌తో భారత్ మూడు వన్డేలతో పాటు మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. బీసీబీ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో మూడు వన్డేలు, సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో టీ20 సిరీస్ జరగనుంది. భారత పర్యటనతో పాటు పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది.
'ఈ షెడ్యూల్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రికెట్ గొప్ప సీజన్‌ను పునరుద్దరించనుంది. ఇది దేశ అభిమానులకు స్థానికంగా అంతర్జాతీయ క్రికెట్‌ను చూసే అవకాశాన్ని కల్సిస్తుంది. మ్యాచ్ వేదికల వివరాలను త్వరలో ప్రకటిస్తాం.'అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో పేర్కొంది. అయితే భారత బంగ్లా పర్యటన కూడా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌పై భారత పౌరులు ఆగ్రహంగా ఉన్నారు.