టెస్ట్ సిరీస్‌లో ఆసీస్‌ను భయపెడతాం.. టీ20 ప్రపంచకప్‌కు అతను కీలకం: విరాట్ కోహ్లీ

సిడ్నీ: అప్‌కమింగ్ టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను భయపెట్టేలా సిద్ధమవుతామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. సిడ్నీ వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. కోహ్లీ (60 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85) ఒంటి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. చివరి మ్యాచ్‌లో ఓడినా కోహ్లీసేన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ మిడిల్ ఓవర్ల వైఫల్యమే మ్యాచ్‌ను దూరం చేసిందన్నాడు. ఈ సిరీస్ గెలుపు ఉత్సాహాన్ని టెస్ట్‌ల్లోనూ కొనసాగిస్తామన్నాడు.

వారి సొంతగడ్డపై వణికిస్తాం..
‘హార్దిక్ పాండ్య భారీ షాట్లు మొదలుపెట్టడంతో లక్ష్యాన్ని ఛేదిస్తామని భావించాం. అయితే మిడిల్ ఓవర్లలో మా బ్యాటింగ్ మ్యాచ్‌ను దూరం చేశాయి. మిడిల్ ఓవర్లలో 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే హార్దిక్‌కు సులువుగా ఉండేది. తిరిగి బలంగా పుంజుకుని టెస్టు సిరీస్‌లో ఆసీస్‌ను భయపెట్టడానికి మార్గాలు అన్వేషిస్తాం. అయితే ఈ ఏడాదిని మరింత గొప్పగా ముగించడానికి టీ20 సిరీస్ విజయం దోహదపడుతుంది. ఇదే పోటీతత్వాన్ని టెస్టుల్లో కూడా కొనసాగిస్తాం. ఆసీస్‌లో ఆడిన అనుభవం మాకు ఉంది. పరుగులు సాధిస్తాం. భారీ స్కోరు సాధించాలంటే ప్రతి సెషన్‌కు ప్రణాళికతో ఆడాలి.

నట్టూ సూపర్..
గతంలో పర్యటించిన జట్టు కంటే ప్రస్తుత జట్టు ఎంతో బలంగా ఉంది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో నేను ఆడటం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బుధవారం ఆడాలా వద్దా అని ఆలోచిస్తా. మా ఫిజియోతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటా. ఇక నటరాజన్ ప్రదర్శనపై ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. షమీ, బుమ్రా లాంటి కీలక బౌలర్ల గైర్హాజరీలో నటరాజన్ 6 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అరంగేట్రం సిరీస్‌లోనే ఇంతలా ఆకట్టుకున్న నటరాజన్‌కు మంచి భవిష్యత్తు ఉంది. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్న అతను రానున్న మ్యాచ్‌ల్లో ఇదే ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నా. ఒకవేళ నటరాజన్ నుంచి స్థిరమైన ప్రదర్శన ఉంటే రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలక బౌలర్ అవుతాడు.

స్టార్ ఆటగాళ్లు లేకున్నా..
ఈ టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, బుమ్రా, షమీ లాంటి కీలక ఆటగాళ్లు లేకున్నా.. ఒత్తిడిని దరి చేరకుండా యువ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు ఓడినా.. చివరి వన్డే గెలవడంతో ఆత్మ విశ్వాసం పెరిగింది. అదే నమ్మకంతో టీ20 సిరీస్‌ను ఆరంభించాం. మొదటి టీ20లో తక్కువ స్కోరు నమోదు చేసినా బౌలర్ల అద్భుత ప్రతిభతో మ్యాచ్‌ను గెలిచాం. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లోనూ అదే ప్రతిభను కనబరిచి సిరీస్‌ను దక్కించుకున్నాం. చివరి టీ20లో ఓడినా.. జట్టులోని ఆటగాళ్లంతా సమిష్టి ప్రదర్శన కనబరిచారు. ఫీల్డింగ్ లోపాలతో పాటు బౌలింగ్‌లోనూ కాస్త మెరుగైన ప్రదర్శన వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేది 'అని కోహ్లీ పేర్కొన్నాడు.

శుక్రవారం నుంచి ప్రాక్టీస్ మ్యాచ్..
డిసెంబర్ 11 నుంచి ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగే సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా గులాబీ బంతితో ఆడనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో.. తొలి టెస్టు డే/నైట్ కావడంతో గులాబి బంతి సన్నాహక మ్యాచ్ ఆటగాళ్లకు ఉపయోగపడుతుంది. ఇక, పెటర్నీటీ సెలవులతో కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవుతున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications