
సిడ్నీ: ఈ తరం క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. నిలకడకు మారుపేరైన విరాట్.. తన బ్యాటింగ్ నైపుణ్యంతో పరుగుల వేటలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. మరెన్నో ఘనతలను అందుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం తర్వాత అంత గొప్ప పేరు సాధించిన ఆటగాడు కోహ్లీ. అయితే ఈ పరుగుల యంత్రాన్ని తాము ఏమాత్రం ఇష్టపడమని, కానీ ఓ క్రికెట్ అభిమానిగా అతని బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తామని ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు.
అప్‌కమింగ్ బార్డర్- గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడిని టిమ్ పైన్.. ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నాడు. 'కోహ్లీ గురించి నన్ను చాలా మంది అడుగుతుంటారు. అయితే, నా దృష్టిలో అందరిలాగే అతడూ ఒక ఆటగాడు మాత్రమే. తన విషయంలో నేనేం కంగారు పడను. నిజం చెప్పాలంటే కోహ్లీతో మాకు అంత బలమైన బంధం లేదు. టాస్ వేసేటప్పుడు మాత్రమే అతన్ని చూస్తాను.
తర్వాత కలిసి ఆడతాం. అంతకుమించి ఇంకేం ఉండదు. అతడిని మేం ఇష్టపడం కానీ, ఒక క్రికెట్ అభిమానిగా మాత్రం అతడు ఆడుతుంటే చూడాలనుకుంటాం. అతని బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తాం. అయితే ఎక్కువ పరుగులు చేస్తే మాత్రం సహించం. అందులో ఎలాంటి సందేహం లేదు. మా రెండు జట్ల మధ్య రసవత్తర పోటీ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కొన్ని సార్లు మేం మాటలతో కూడా ఒకరిపై ఒకరం దాడి చేసుకున్నాం. అయితే ఈసారి అలా జరగదు. ఇప్పుడు నేను, కోహ్లీ సారథులం. మంచి ఆటగాడు క్రీజులో ఉంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో కూడా జోరూట్, బెన్ స్టోక్స్‌లు ఆడుతున్నప్పుడు ఇలానే అనిపిస్తుంది. ' అని ఆస్ట్రేలియా కెప్టెన్ పేర్కొన్నాడు.